కొత్తగూడెం సింగరేణి/ ఇల్లెందు/ మణుగూరు టౌన్, జూలై 3 : తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం చొరవ తీసుకోవాలని కోరుతూ సింగరేణి అధికారులు ఏరియా జీఎం కార్యాలయాల ఎదుట చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శుక్రవారం ఐదో రోజుకు చేరాయి. ఈ సందర్భంగా దీక్షల్లో కూర్చున్న పలువురు మహిళా అధికారులు మాట్లాడుతూ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించకుండా యాజమాన్యం నిర్లక్ష్యం చేయడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వేతన సవరణ, పే అప్‌గ్రేడేషన్ అమలు చేయాలని, రెండేళ్ల ప్రొడక్షన్ రిలేటెడ్ పే, పీఆర్పీ వెంటనే విడుదల చేయాలని పలుమార్లు విజ్ఞప్తులు చేసినా స్పష్టమైన హామీ లభించలేదన్నారు.
వెంటనే తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొత్తగూడెం దీక్షల్లో సింగరేణి మహిళా అధికారులు డాక్టర్ కె.రేష్మా, ఈ.సుధారాణి, సంధ్యారాణి, ప్రశాంతి, ఉషశ్రీ, సుమలత, ఉమామహేశ్వరి, వి.సరళ, జి.శ్రీరమ్య, వి.పూజ, ఇల్లెందు దీక్షల్లో అధికారుల సంఘం నాయకులు ఎం.నాగరాజునాయక్, పూర్ణచందర్, దామోదర్, అంజిరెడ్డి, వీసం కృష్ణయ్య, జి.శివప్రసాద్, కేశవరావు, కిషన్, వినోద్, శ్రీనివాస్, నరేశ్‌కుమార్, వరుణ్‌కుమార్, యుగంధర్, శ్రీకాంత్, రాజేశ్, నగేశ్ తదితరులు కూర్చున్నారు. కాగా, దీక్షల్లో కూర్చున్న వారికి సీఎంఓఏఐ, ఏఈసీ కార్పొరేట్ ప్రతినిధులు, సీపీఐతోపాటు ప్రజా సంఘాల నాయకులు, టీయూడబ్ల్యూజే 143 జిల్లా అధ్యక్షుడు కల్లోజి శ్రీనివాస్ తదితరులు సంపూర్ణ మద్దతు తెలిపారు.