ఖమ్మం కల్చరల్, డిసెంబర్ 15: సాంకేతికత, కళా నైపుణ్యం.. సురభి సంస్థ సొంతమని పలువురు వక్తలు ప్రశంసించారు. ఎన్నో సంవత్సరాలుగా నాటకాలను బతికిస్తున్న సురభి కళాకారులను ఆదుకోవాలని కోరారు. సురభి శ్రీవిజయభారతి నాట్య మండలి ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న సురభి నాటకోత్సవాల్లో భాగంగా గురువారం కళాకారులు ‘సతీ సావిత్రి’ నాటకాన్ని ప్రదర్శించారు. తొలుత ప్రముఖ వ్యాపారవేత్త మేళ్లచెర్వు వెంకటేశ్వరరావు, పారుపల్లి సురేశ్.. జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. సినిమాను మించి సన్నివేశానికి తగినట్లు సెట్టింగ్లు, ఆయా పాత్రల్లో జీవించే కళాకారుల అద్భుత నటన.. సురభి నాటక సమాజం ప్రత్యేకత అన్నారు. సంచారంగా రెండు తెలుగు రాష్ర్టాల్లో పౌరాణిక నాటకాలను ప్రదర్శిస్తూ భావితరాలు ప్రాచీన కళను మర్చిపోకుండా చేస్తున్న కళాకారుల సేవలు అనన్యమని అన్నారు. స్వచ్ఛంద సంస్థలు, కళాభిమానులు సురభి కళాకారులను ఆదుకోవాలని కోరారు. సురభి నాట్య మండలి కార్యదర్శి సురభి ఉపేందర్, కళాకారులు రంగాచారి, పుతుంబాక కృష్ణప్రసాద్, శ్రీదేవి పాల్గొన్నారు.
త్రికరణ శుద్ధిగా పతియే దైవమని భావించిన పతివ్రత సావిత్రి.. యముడితో పోరాడి తన భర్త ప్రాణాన్ని తిరిగి దక్కించుకుని, ఆయుష్షను పెంచుకున్న ఘట్టాలను అద్భుతంగా రక్తి కట్టించారు. సావిత్రి భర్త సత్యవంతుడికి అల్పాయుష్షు ఉండడంతో ప్రాణాన్ని తీసుకెళ్లడానికి వచ్చిన యమధర్మరాజుతో సంవాదనలు చేసి మెప్పించి, ఒప్పించి భర్త ప్రాణాన్ని తిరిగి పొంది ఆయుష్షును పెంచుకున్న సన్నివేశాలు ఆకట్టుకున్నాయి. ధర్మరాజును సావిత్రి వెంబడించి తన భర్తకు ప్రాణభిక్ష పెట్టమన్న వేడుకోలు, వారి మధ్య వాదోపవాదనలు ఉత్కంఠ కలిగించాయి. సావిత్రి పాతివ్రత్యానికి మెచ్చిన యముడు ప్రసన్నమవుతాడు. పుణ్యఫలం కేవలం పాతివ్రతం వల్లనే కలుగుతుందని చాటే ఈ నాటకం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. సావిత్రిగా హేమ మానస, సత్యవంతుడిగా వాసుదేవరావు, యముడిగా దినకర్, నారదుడిగా శుభకర్తోపాటు విష్ణుశర్మ, నిరంజన్, మల్లిక, సంధ్య తమ పాత్రల్లో జీవించి మెప్పించారు.