ఖమ్మం రూరల్, జూన్ 04 : అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించడమే ఎస్.ఐ.ఆర్ లక్ష్యమని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అన్నారు. ఖమ్మం రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలోనీ రైతు వేదికలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొని ప్రజలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ, వార్డు సభలు ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేరవేసే ముఖ్య వేదికలన్నారు. ఎస్.ఐ.ఆర్ కార్యక్రమంపై సమగ్ర వివరాలు తెలియజేసి, ప్రజలు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. ఇరిగేషన్ శాఖకు సంబంధించిన కాలువల అభివృద్ధి, సాగునీటి పనుల పురోగతిపై గ్రామస్తులతో చర్చించారు. రాబోయే ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ఎరువుల కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని తెలిపారు. నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.
పంటల మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పిస్తూ, వాతావరణ శాఖ అంచనాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటలైన ఆయిల్‌పామ్, కూరగాయలు, పండ్ల తోటల సాగుపై దృష్టి సారించాలని సూచించారు. వర్షాభావ పరిస్థితులు తక్కువగా ఉన్న నేపథ్యంలో బోర్వెల్ సౌకర్యం కలిగిన రైతులు షార్ట్ డ్యూరేషన్ వరి సాగు చేపట్టవచ్చని తెలిపారు. పంటలకు రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రీయ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. గ్రామాలలో చెత్తను సమర్థవంతంగా నిర్వహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. రోజురోజుకూ పెరుగుతున్న జనాభా నేపథ్యంలో పర్యావరణ కాలుష్యం పెరుగుతోందని, ప్రస్తుతం స్వచ్ఛమైన తాగునీటి కోసం డబ్బులు చెల్లిస్తున్నామని, భవిష్యత్‌లో స్వచ్ఛమైన గాలి కోసం కూడా డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి రాకుండా పర్యావరణ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని సూచించారు. భవిష్యత్ తరాలు మెరుగైన జీవనం సాగించాలంటే పర్యావరణ పరిరక్షణ అత్యంత ముఖ్యమని అన్నారు. వాతావరణ మార్పుల ప్రభావంతో ఒకేరోజు కుంభవృష్టి తరహా వర్షాలు కురిసి వరదలు సంభవిస్తున్నాయని, అడవుల నరికివేత కారణంగా కోతులు జనావాసాల్లోకి వస్తున్నాయని తెలిపారు. కోతుల సమస్యకు తక్షణ పరిష్కారం లేదని, గ్రామస్థులు తమ జీవన విధానంలో మార్పులు చేసుకుంటేనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని పేర్కొన్నారు.
జిల్లాకు సమగ్ర విపత్తు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేయాల్సిన అవసరాన్ని వివరించిన కలెక్టర్, రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని గ్రామాల్లో మురుగు కాల్వల శుభ్రత, పరిసరాల పరిశుభ్రత, నీటి సంరక్షణ చర్యలు, కమ్యూనిటీ సోక్పిట్ల నిర్మాణం వంటి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. వరదల సమయంలో ప్రజలు ప్రభుత్వ యంత్రాంగానికి సహకరించి లోతట్టు ప్రాంతాల నుంచి వెంటనే సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని సూచించారు. భారీ వర్షాల కారణంగా ఇండ్లు కూలి పోవడం, విద్యుత్ స్తంభాలు, పెద్ద చెట్లు కూలిపోవడం వంటి ఘటనలతో ప్రాణనష్టం సంభవించే అవకాశం ఉందన్నారు. రహదారులు, కల్వర్టులపై వరద నీరు ప్రవహిస్తున్న సమయంలో అధికారుల హెచ్చరికలను పట్టించుకోకుండా ప్రయాణించడం వల్ల ప్రమాదాలు జరుగు తున్నాయని తెలిపారు. ప్రమాదకర పరిస్థితుల్లో సెల్ఫీలు తీసుకోవడం కూడా ప్రాణాపాయానికి దారితీస్తుందని హెచ్చరించారు. పాతబడిన ఇళ్లలో నివసించే వారు భారీ వర్షాల సమయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు లేదా ఇతర సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. వరదల సమయంలో అనవసరంగా బయటకు వెళ్లవద్దని, విపత్కర పరిస్థితుల్లో హీరో అవ్వాలని ప్రయత్నించవద్దని హితవు పలికారు.
ఎస్.ఐ.ఆర్ కార్యక్రమం ద్వారా ఓట్లు తొలగిపోతాయనే ప్రచారం పూర్తిగా అపోహ మాత్రమేనని కలెక్టర్ స్పష్టం చేశారు. స్వాతంత్ర్యం అనంతరం పలుమార్లు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించారని, ఓటరు జాబితా శుద్ధీకరణే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని, మరణించిన వారు, శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, డూప్లికేట్ ఓట్లు మాత్రమే తొలగిస్తామని చెప్పారు. అర్హత ఉన్న ఒక్క ఓటరు కూడా తన ఓటు హక్కును కోల్పోరని భరోసా కల్పించారు. జూన్ 25 నుంచి జూలై 24 వరకు బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి మిగిలిన ఓటర్లకు ఎన్యుమరేషన్ ఫారాలు అందజేస్తారని తెలిపారు. ప్రజలు తమ వివరాలను నమోదు చేసి ప్రభుత్వం గుర్తించిన 11 గుర్తింపు పత్రాల్లో ఏదో ఒక దానిని జతచేసి సమర్పించాలని సూచించారు. జూలై 31, 2026న డ్రాఫ్ట్ ఎస్.ఐ.ఆర్ ఓటరు జాబితా విడుదల చేస్తామని తెలిపారు. ప్రతి ఓటరు తన పేరు డ్రాఫ్ట్ జాబితాలో ఉందో లేదో పరిశీలించాలని, అభ్యంతరాలు, ఫిర్యాదులు, కొత్త క్లెయిమ్‌లు ఉంటే ఆగస్టు 30లోగా సమర్పించాలని సూచించారు.
జూలై 1, 1987కు ముందు భారతదేశంలో జన్మించిన వారు తమ స్వీయ గుర్తింపు లేదా జనన ఆధార పత్రాలు సమర్పిస్తే సరిపోతుందని, జూలై 1, 1987 నుంచి డిసెంబర్ 2, 2004 మధ్య జన్మించిన వారు తమ పత్రాలతో పాటు తండ్రి లేదా తల్లి ఎవరి అయినా ఒకరి పత్రం సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 2, 2004 తర్వాత జన్మించిన వారు తండ్రి, తల్లి ఇద్దరి పత్రాలు సమర్పించాల్సి ఉంటుందని వివరించారు.
సెప్టెంబర్ 28, 2026 నాటికి అన్ని అభ్యంతరాలు, క్లెయిమ్‌లను పరిష్కరించి, అక్టోబర్ 1, 2026న తుది ఓటరు జాబితా ను విడుదల చేస్తామని జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ బి జ్యోతి, ఆత్మ పిడి బి.సరిత, ఏఓ ఉమా నగేష్, పశువైద్యులు జగ్గులాల్ సంబంధిత శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.