పెద్ద రోడ్డు వచ్చి చిన్న రోడ్డును మింగడంతో స్థానికులు పడుతున్న ఇబ్బందులు అనంతంగా ఉన్నాయి. నేషనల్ హైవే నిర్మాణంలో భాగంగా అడ్డుగా ఉందంటూ ఆర్అండ్బీ రోడ్డును మూసివేశారు. కనీసం అండర్ పాస్ ఇవ్వకుండా హైవేను పూర్తిచేశారు. రాకపోకలు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతుండడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో అండర్పాస్ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. తాత్కాలిక ఉపశమనంగా నేరుగా హైవేను దాటేందుకు అనుమతిచ్చారు. తరువాత ప్రమాదాలు జరుగుతుండడంతో తాజాగా దాన్ని మొత్తాన్ని మూసివేశారు. దీంతో ఏళ్లకేళ్లుగా తాము రాకపోకలు సాగించిన రోడ్డు మూతబడడంతో పరిసర గ్రామాల ప్రజలు పడరాన్ని పాట్లు పడుతున్నారు.
-ముదిగొండ, జనవరి 3
365ఏ నంబరు గల ఖమ్మం-కోదాడ జాతీయ రహదారి ముదిగొండ మండలంలోని 4 గ్రామాల మీదుగా 8 కిలోమీటర్ల మేర ఉంది. అయితే, ముదిగొండ శివారులో సువర్ణాపురాన్ని, ముదిగొండను కలుపుతూ ఆర్అండ్బీ రోడ్డు ఎన్నో ఏళ్లుగా వినియోగంలో ఉంది. ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు ఈ రోడ్డు ఎంతో ముఖ్యమైనది. ఇరు గ్రామాల ప్రజలు, రైతులు, విద్యార్థులు నిత్యం ఈ రోడ్డు మీదుగానే ప్రయాణిస్తారు. అయితే, 365ఏ హైవే నిర్మించే క్రమంలో ఎన్హెచ్ఏఐ అధికారులు ఈ రోడ్డును మూసివేశారు. దీని మీదుగా హైవేను నిర్మించడంతో ఈ రోడ్డు అక్కడితో నిలిచిపోయింది.
అయితే, ఏదైనా రహదారి నిర్మించాలంటే ఆ ప్రదేశాన్ని మ్యాపులో గుర్తించి తరువాత క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలి. రోడ్లు, చెరువులు, వాగులు, డొంక దారులు ఉంటే వాటిపై రాకపోకలకు ఆటంకం ఏర్పడకుండా హైవేను నిర్మించుకోవాలి. లేదంటే ప్రత్యామ్నాయ మార్గాలు నిర్మించాలి. ఇందుకోసం ఆ ప్రాంతంలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని అలైన్మెంట్ పూర్తి చేయాలి. కానీ.. 365ఏ హైవే నిర్మాణ సమయంలో ఎన్హెచ్ఏఐ అధికారులు ఇవేమీ పట్టించుకోకుండా ఖమ్మంకోదాడ హైవే నిర్మాణానికి అలైన్మెంట్ ఇచ్చారు. కానీ.. సువర్ణాపురంముదిగొండ రోడ్డును మూసివేశారు. దీంతో ఈ రెండు గ్రామాల మధ్య రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది.
దీంతో ప్రయాణికులు, రైతులు సుమారు కిలోమీటరు ముందుకెళ్లి అక్కడ యూ టర్న్ తీసుకుని మళ్లీ వెనక్కు రావాల్సి వస్తోంది. ప్రధానంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చిన్న పనులకు సైతం కిలోమీటర్ల మేర ప్రయాణించి చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. కొందరు రైతుల పొలాలు రోడ్డుకు ఇటు కొంత, అటు కొంత ఉన్నాయి. దీంతో వారు ప్రతిసారీ చుట్టూ తిరిగి రాలేక ఇక్కట్లు పడుతున్నారు.
ఖమ్మం కోదాడ హైవే నిర్మాణం మొదలుపెట్టినప్పుడు, అది పూర్తయి రాకపోకలు ప్రారంభమైనప్పుడు సువర్ణాపురంముదిగొండ ఆర్అండ్బీ రోడ్డు మూతబడడంతో స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అందుకు ఎన్హెచ్ఏఐ అధికారులు స్పందించి వచ్చి ఆందోళనకారులతో మాట్లాడారు. స్థానికంగా రాకపోకలకు ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తరువాత కూడా ఏమీ పట్టించుకోకపోవడంతో మరోసారి ప్రజలు నిలదీశారు. దీంతో అధికారులు స్థానికులకు దిమ్మతిరిగే సమాధానమిచ్చారు. ఇక్కడి నుంచి సుమారు కిలోమీటరు దూరంలో ముదిగొండ-న్యూలక్ష్మీపురం రోడ్డులో అండర్పాస్ నిర్మించామని, మళ్లీ ఇక్కడ ఎలాంటి అండర్పాస్ ఏర్పాటు చేయడం వీలుకాదని స్పష్టం చేశారు.
హైవే పనులకు అడ్డుపడితే కేసులు పెడతామని హెచ్చరించారు. అయినా స్థానికులు వెనుకడుగు వేయకపోవడంతో హైవేను దాటేలా చూస్తామని అన్నారు. అయితే, హైవేపై వాహనాలు అధిక వేగంతో వెళ్తాయి కాబట్టి ఆ సమయంలో ప్రమాదాలు జరుగకుండా స్పీడ్ బ్రేకర్లు, లైటింగ్ సిగ్నళ్లు ఏర్పాటు చేస్తామని ఎన్హెచ్ఏఐ అధికారులు హామీ ఇచ్చారు. ఆ తరువాత కొద్దిరోజులు రోడ్డు దాటడానికి అనుమతించారు. అయితే, జాతీయ రహదారి కావడంతో వాహనాలు అతివేగంగా రాకపోకలు సాగిస్తున్నాయి. సువర్ణాపురంముదిగొండ మార్గం మీదుగా రాకపోకలు సాగించే ప్రజలు ఈ హైవేను దాటే క్రమంలో పలు ప్రమాదాలు జరిగాయి. దీంతో హైవేను దాటకుండా పిల్లర్లు పెట్టి అనుమతిచ్చిన మార్గాన్ని మూసివేశారు.