భద్రాచలం : రథోత్సవం సందర్భంగా రథాన్ని లాగుతున్న ఆలయ అధికారులు
భద్రాచలం, జనవరి16 : సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో సోమవారం రాత్రి రథోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత సాయంకాలపు ఆరాధన, రాజ దర్భార్ సేవ, యాగశాలలో రథాంగ హోమం, బలిహరణం, పూర్ణాహుతి జరిపారు. స్వామివారికి చక్కెర పొంగలిని నివేదించారు. రథంలో స్వామివారి ఉత్సవమూర్తులను వేంచేపు చేసి రాచ గుమ్మడికాయతో రథానికి దిష్ఠి తీశారు. ఆలయ అధికారులు రథాన్ని లాంఛనంగా లాగి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం భక్తులు స్వామివారికి కొబ్బరికాయలు, హారతులు, అరటిపళ్లు సమర్పించారు. రథసేవ ఆలయం నుంచి తాతగుడి సెంటర్ వద్ద ఉన్న గోవిందరాజుల స్వామివారి ఆలయం వరకు కొనసాగింది. పోలీసులతోపాటు సీఆర్పీఎఫ్ దళాలతో బందోబస్తు నిర్వహించారు.
పర్ణశాల రామయ్యకు తిరువీధి సేవ
సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన పర్ణశాల ఆలయంలో రామయ్యకు ఘనంగా తీరువీధి సేవ నిర్వహించారు. ఉదయం నుంచి మూలవిరాట్లకు నూతన వస్ర్తాలు అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఉత్సవ మూర్తులకు విశేష అలంకరణ, తిరువారాధన, రథహోమం, రాధా అలంకారం, రథబలి, సంప్రోక్షణ నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథంపై వేంచేపు చేసి తిరువీధి సేవ నిర్వహించి ప్రధాన ద్వారం వద్ద ప్రళయ కలహోత్సవం కన్నుల పండువగా చేపట్టగా.. భక్తులు తిలకించారు. అనంతరం స్వామివారి నివేదన కార్యక్రమం నిర్వహించారు.