రోగ నిర్ధారణలో ఎంతో కీలకమైన ల్యాబ్ రిపోర్టులు రేడియాలజీ నిపుణుల నిర్ధారణ లేకుండా రోగుల చేతికి అందుతున్నాయి. రోగ నిర్ధారణలో ప్రామాణికత కోసం అధునాతన ఎక్విప్మెంట్ అందుబాటులోకి వచ్చినప్పటికీ.. కొన్ని ల్యాబ్‌లు మాత్రం లాభాపేక్షే లక్ష్యంగా ముందుకు సాగుతూ వాటి జోలికి వెళ్లడం లేదు. పాత ఎక్విప్మెంట్లతోనూ, అందునా తెలిసీ తెలియని సిబ్బందితోనూ రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ, చేయిస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాయి. పర్యవేక్షణ వ్యవస్థలు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో భద్రాద్రి జిల్లాలోని ప్రైవేటు డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్ల విచ్చలవిడి తనానికి అడ్డూఅదుపూ లేకుండా పోతోంది.
ప్రైవేటు వైద్యుల కనుసన్నల్లోనే ల్యాబ్‌లు కొనసాగుతుండడం, సుస్తీ చేసిందని రోగులు వెళ్తే లెక్కకు మిక్కిలి టెస్టులు రాస్తుండడం, ఆ లిస్టు తీసుకొని ల్యాబ్‌కు వెళ్తే అక్కడ రోగుల ప్రాణాలను రిస్కులో పెట్టి మరీ నిలువు దోపిడీ చేస్తుండడం వంటివి పరిపాటిగా మారాయి. ఎక్కడో ఒకచోట రోగుల ప్రాణాలు పోయినప్పుడు కొన్నిరోజులపాటు వైద్య శాఖ హడావిడి చేయడం, మొక్కుబడిగా తనిఖీలు చేపట్టడం, ఒకటో రెండో ల్యాబ్‌లు సీజ్ చేయడం, ఆ తరువాత అవి మళ్లీ తెరుచుకోవడం వంటివి షరా మామూలుగానే జరుగుతుండడం గమనార్హం.
-భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (నమస్తే తెలంగాణ)
జాతీయ వైద్య మండలి వైద్య ప్రమాణాలను భద్రాద్రి జిల్లాలోని డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లు పట్టించుకుంటున్న పరిస్థితి కన్పించడం లేదు. డయాగ్నస్టిక్, స్కానింగ్ సెంటర్లలో రోగ నిర్ధారణను తప్పనిసరిగా సదరు రేడియాలజీ వైద్య నిపుణులే చేయాల్సి ఉంటుంది. కానీ.. జిల్లాలోని అనేక ల్యాబ్‌లలో రేడియాలజిస్టులు, సదరు విభాగాల వైద్య నిపుణులు లేకుండా రోగులకు రిపోర్టులు అందుతున్నాయి. సరైన ఎక్విప్మెంట్ కూడా లేని కొన్ని ల్యాబ్‌లలో అక్కడి సిబ్బంది, కాస్త అనుభవమున్న సిబ్బంది పరీక్షలు చేస్తుండడం గమనార్హం. రేడియాలజిస్టులు రోగాన్ని నిర్ధారించి సంతకం చేసి ఇవ్వాల్సిన రిపోర్టులపై అక్కడి సిబ్బంది సంతకం చేసి ఇస్తున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ప్రైవేటు డయాగ్నస్టిక్ సెంటర్లతోపాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో వైద్యులే ల్యాబ్‌లను ఏర్పాటు చేసుకోవడం వల్ల వైద్యారోగ్య శాఖ అధికారులు కూడా తూతూమంత్రంగానే తనిఖీలు చేస్తున్నారు. అనుమతులు లేని కారణంగా ఇటీవల మణుగూరులో ఒక డయాగ్నస్టిక్ సెంటర్‌ను, కొత్తగూడెంలో ఒక డయాలసిస్ సెంటర్‌ను అధికారులు సీజ్ చేశారు. కానీ.. అనుమతుల్లేకుండా జిల్లాలో కోకొల్లలుగా ఉన్న డయాగ్నస్టిక్ సెంటర్లను చూసీచూడనట్లు వదిలేస్తున్నారు. టెస్టుల పేరుతో ల్యాబ్‌లలో అధిక ఫీజులు వసూలు చేస్తున్నా స్పందించిన దాఖలాలు లేవు.
భద్రాద్రి జిల్లాలో 423 ప్రైవేటు ఆసుపత్రులు, 143 డయాగ్నస్టిక్ సెంటర్లు ఉన్నాయి. ఇవన్నీ ప్రైవేటు వైద్యులు నెలకొల్పుకున్నవి, వారి కనుసన్నల్లో నడిచేవే. ఇక స్కానింగ్ సెంటర్లు 77, గైనిక్ ల్యాబ్‌లు 60, రేడియాలజీ ల్యాబ్‌లు 12, టుడీ ఎకో ల్యాబ్‌లు రెండు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ సెంటర్ ఉన్నప్పటికీ రోగులు ప్రైవేటును ఆశ్రయించడం వల్ల ల్యాబ్‌ల నిర్వాహకులు ఫీజులతో పీల్చిపిప్పి చేస్తున్నారు. గర్భిణులు నెలకు రెండుసార్లు తప్పనిసరిగా చెకప్ చేయించుకోవాల్సి రావడంతో వారు ప్రసవించే సమయానికి ఈ స్కానింగ్లకే అధిక మొత్తం ఖర్చవుతోంది.
ప్రైవేటు ల్యాబ్‌లు అధిక ఫీజులు వసూలు చేస్తున్న విషయం ఇటీవల కలెక్టర్ దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన వెంటనే ప్రైవేటు ల్యాబ్‌ల యజమానులు, వైద్యులతో సమావేశం నిర్వహించారు. ఫీజులను 30 శాతం తగ్గించాలని ఆదేశించారు. కానీ.. అవి బేఖాతరైనట్లుగానే కన్పిస్తోంది.
ఒక జబ్బు వచ్చిందని ప్రైవేటు ఆసుపత్రికి వెళ్తే అక్కడి వైద్యులు అనేక టెస్టులు రాస్తున్నారు. అవన్నీ చేయించుకునే సరికి తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోతున్నాయి. పరీక్షల పేరిట ప్రైవేటు వైద్యులు రాసి ఇస్తున్న టెస్టుల లిస్టులు చూస్తే భయాందోళన కలుగుతున్నప్పకీ చేయించుకోక తప్పని పరిస్థితి అవుతోంది.
-టి.సత్యవతి, మణుగూరు
ప్రభుత్వ ఆసుపత్రికి వెళితే సమయానికి వైద్యులుండరు. అందువల్ల ప్రైవేటుకు వెళితే పరీక్షల పేరు చెప్పి వారు దోపిడీ చేస్తున్నారు. డబ్బులన్నీ ల్యాబ్ టెస్టులకే అయిపోతున్నాయి. చిన్న డౌట్ ఉండి ఆసుపత్రికి వెళ్లినా టెస్టులు మాత్రం తప్పడంలేదు. గర్భిణులకు నెలకు రెండుసార్లు టెస్టులు కంపల్సరీ కావడంతో కచ్చితంగా వెళ్లాల్సి వస్తోంది.
-ఉషాకిరణ్మయి, గర్భిణి, కొత్తగూడెం
ల్యాబ్‌లలో అధికంగా ఫీజులు వసూలు చేసినట్లు ఫిర్యాదులు అందినా, సమాచారం వచ్చినా వెంటనే వెళ్లి తనిఖీలు చేస్తున్నాం. నిబంధనలను అతిక్రమించిన ల్యాబ్‌లను సీజ్ చేస్తున్నాం. ఇప్పటికే రెండు ల్యాబ్‌లను సీజ్ చేశాం. స్కానింగ్ సెంటర్లను కూడా తనిఖీ చేస్తున్నాం. జిల్లా ఆసుపత్రిలో డయాగ్నస్టిక్ సెంటర్ అందుబాటులో ఉంది. అక్కడ మొత్తం 155 పరీక్షలు చేస్తున్నాం.
-భాస్కర్‌నాయక్, డీఎంహెచ్‌వో, భద్రాద్రి