కొత్తగూడెం క్రైం, జనవరి 10: పోలీసుల పని తీరుతో మీరు సంతృప్తికరంగా ఉన్నా రా..? అసంతృప్తిగా ఉన్నా రా..? ఏదైనా సరే. మీరు నేరుగా మీ అభిప్రాయాలను చెప్పేందుకు ఇప్పుడు అవకాశముంది. పోలీస్ సర్కిల్, డీఎస్పీ కార్యాలయాల్లోని ‘క్యూఆర్ కోడ్ ఆఫ్ సిటిజన్’ పేరుతోగల కోడ్‌ను స్కాన్ చేసి, మీరు చెప్పదలచుకున్నది తెలపవచ్చు. ఎస్పీ బిరుదరాజు రోహిత్‌రాజు శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఎస్పీ తెలిపిన వివరాలు.. ‘జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో, సర్కిల్-డీఎస్పీ-ఎస్పీ కార్యాలయాల్లో ఈ క్యూఆర్ కోడ్ పోస్టర్ అందుబాటులో ఉంటుంది.
ఈ క్యూఆర్ కోడ్‌ను గురువారం ఎస్సీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్ లాంఛనంగా ఆవిష్కరించారు. బాధితులు తమ సమస్యలను తెలుపుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు/ సిబ్బంది వ్యవహరించిన తీరు, ఫిర్యాదులపై స్పందన, పాస్‌పోర్ట్ వెరిఫికేషన్, ఈ-చలాన్, ఎఫ్ఐఆర్ తదితర అన్ని రకాల సేవలపై స్పందనను, అభిప్రాయాలను సేకరించేందుకు ఈ క్యూఆర్ కోడ్ అందుబాటులోకి వచ్చింది. ఈ కోడ్‌ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, పోలీసుల పనితీరుపై సలహాలు, సూచనలు ఇవ్వాలి’.