భద్రాచలం, ఆగస్టు 20 : చెరువు శిఖాలు, ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమిస్తున్న ఆక్రమణదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భద్రాచలం పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లో సామాజిక కార్యకర్త పూనెం ప్రదీప్ కుమార్ గురువారం ఒక్కరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఆక్రమణదారుల నుంచి ఆ భూములు స్వాధీనం చేసుకొని నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ శివారులోని చెరువులు, ప్రభుత్వ భూములు, డ్రైనేజీలు ఆక్రమించి బహుళ అంతస్తులు నిర్మిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
శాంతినగర్లో సుమారు రెండు ఎకరాల చెరువును పూడ్చివేసి యథేచ్ఛగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఆ భూములను స్వాధీనం చేసుకొని ఇండ్లు లేని నిరుపేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రదీప్ కుమార్ దీక్షకు మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్రాజ్, గోండ్వానా సంక్షేమ పరిషత్ అధ్యక్షుడు సోందె వీరయ్య, సామాజిక ఉద్యమకారుడు అలవాల రాజా సంఘీభావం తెలిపి, మాట్లాడారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో అధికారులు విఫలమైతే తమ సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.