మామిళ్లగూడెం, జూన్ 26 : మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మించే ఉద్యమంలో ప్రతీ ఒక్కరూ పాలుపంచుకోవాలని పోలీస్ కమిషనర్ సునీల్‌దత్ పిలుపునిచ్చారు. అంతర్జాతీయ మాదకద్రవ్య, అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం ఖమ్మం నగరంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలన అవగాహన ర్యాలీ నిర్వహించారు. మమత మెడికల్ కాలేజీ, హర్వెస్ట్, ఎస్‌ఆర్‌అండ్‌బీజీఎన్‌ఆర్ కళాశాల విద్యార్థులు పాల్గొన్న ర్యాలీని అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజతో కలిసి సీపీ జెండా ఊపి ప్రారంభించారు.
మమత రోడ్డులోని టాటా మోటార్ సర్వీస్ సెంటర్ నుంచి లకారం ట్యాంక్ బండ్ వరకు సాగిన ర్యాలీలో మత్తు పదార్థాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్‌ను అంధకారం చేసుకోకూడదని విద్యార్థులు ప్లకార్డులు పదర్శించారు. అనంతరం ప్రతిజ్ఞ చేసి యాంటీ డ్రగ్స్ సోల్జర్‌గా సైన్ చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ మాదకద్రవ్యాలను సమాజం నుంచి సమూలంగా నిర్మూలించడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు విద్యాసంస్థలలో విద్యార్థులతో యాంటీ డ్రగ్స్ కమిటీలు ఏర్పాటు చేసి.. వారికి అవగాహన కల్పిస్తున్నామన్నారు.
మత్తు పదార్థాల విక్రయాలు, సరఫరా, వినియోగం వంటి సమాచారం ఉన్నైట్లెతే వెంటనే అధ్యాపకులు, యాంటీ డ్రగ్స్ కమిటీలు డయల్ 100, 1908, పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. అదనపు కలెక్టర్ శ్రీజ మాట్లాడుతూ గతంలో సిగరెట్, మద్యంతో సరి పెట్టుకునే యువత ఇప్పుడు నిషా కోసం గంజాయి, మాదక ద్రవ్యాల భారినపడి మత్తుకు బానిసలవుతున్నారని అన్నారు. సమాజంలో మాదకద్రవ్యాల ముప్పును అంతం చేసే లక్ష్యంలో యువత భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ(లా అండ్ ఆర్డర్) ప్రసాద్‌రావు, టౌన్ ఏసీపీ రమణమూర్తి, జిల్లా సంక్షేమాధికారి రాంగోపాల్‌రెడ్డి, డాక్టర్ నితీశ్, సీఐలు భానుప్రకాశ్, కరుణాకర్, స్వామి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.