పాల్వంచ రూరల్, ఫిబ్రవరి 4 : మండలంలోని పెద్దమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పిల్లలకు అన్నప్రాసన, తలనీలాలు సమర్పించి తమను చల్లంగ చూడమని వేడుకున్నారు. సత్రాలు నిండిపోవడంతో భక్తులు చెట్లకింద వంటావార్పు చేపట్టారు. ఆలయ అధికారులు భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు.