మధిర, మే 31 : యువతలో చెడు అలవాట్లు దూరం చేయటానికి తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతతో వ్యవహరించాలని మధిర కోర్టు సీనియర్ సివిల్ జడ్జి, న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎన్.ప్రశాంతి అన్నారు. శనివారం ప్రపంచ పొగాకు నిర్మూలన దినోత్సవం సందర్భంగా మధిర పురపాలక సంఘంలో న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్ అధ్యక్షత వహించిన ఈ సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. యువత పొగాకు నమలడం గానీ, పొగ సేవించడం గానీ, పొగాకు ఉత్పత్తులను నమలడం చేయకూడదన్నారు. ఎలక్ట్రానిక్ సిగరెట్లు తాగడం లాంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు.
తల్లిదండ్రులు జాగ్రత్తతో వ్యవహరించి యువతలో చెడు వ్యసనాలను ముందుగా గుర్తించాలన్నారు. తల్లిదండ్రులు సరైన జాగ్రత్తలు వహించినట్లయితే యువతను పొగాకు ఉత్పత్తుల రుగ్మత నుండి దూరంగా ఉంచవచ్చన్నారు. యువత నేరాల్లో చిక్కుకుని తమ భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని సూచించారు. ఈ సందర్భంగా సదస్సుకు వచ్చిన ప్రజలతో న్యాయమూర్తి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రభుత్వ వైద్యుడు కె.అనిల్‌కుమార్, సీనియర్ న్యాయవాదులు సుంకు మోహన్‌దాస్, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, వాసంశెట్టి కోటేశ్వరరావు, కె.విజయ్ కుమార్, మున్సిపల్ సిబ్బంది, పారా లీగల్ వాలంటీర్స్, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.