కొత్తగూడెం ఎడ్యుకేషన్, జనవరి 11 : పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు జిల్లా విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ ఏడాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12,340 మంది రెగ్యులర్, 600 మంది ప్రైవేట్ విద్యార్థులు మొత్తం 12,940 మంది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. మార్చి 18వ తేదీ నుంచి వార్షిక పరీక్షలు ప్రారంభంకానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు అవసరమైనచోట ఉపాధ్యాయులను రేషనలైజేషన్గా ‘పని’ సర్దుబాటు చేశారు. ఎంఈవోల వద్ద ప్రతిపాదనలు తీసుకొని మండలస్థాయిలో సబ్జెక్టు నిపుణులు, భాషాపండితులను ఎంపిక చేశారు. 41మంది ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో రెండునెలలపాటు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.
అయితే ఉత్తర్వులు జారీచేసి నాలుగురోజులు గడుస్తున్నప్పటికీ విధుల్లో చేరేందుకు కొంతమంది ఉపాధ్యాయులు సుముఖత చూపడం లేదు. ఇప్పటివరకు 20మంది ఉపాధ్యాయులు మాత్రమే విధుల్లో చేరారు. విధుల్లో చేరకుండా మొండికేస్తున్న టీచర్లకు కొంతమంది ఉపాధ్యాయసంఘాల నేతలు వంతపాడుతున్నట్లు తెలుస్తోంది. ఏకంగా జిల్లాస్థాయి అధికారులపైనే ఒత్తిడి తెచ్చి ఆ ఉపాధ్యాయులు పని సర్దుబాటుకి వెళ్లరని, ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై డీఈవో వెంకటేశ్వరచారిని వివరణ కోరగా.. పని సర్దుబాటు చేసిన చోటికి టీచర్లు కచ్చితంగా వెళ్లాల్సిందేనని తేల్చిచెప్పారు.