ఖమ్మం రూరల్, జనవరి 05 : ఏదులాపురం మున్సిపాలిటీకి సంబంధించి తయారు చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్‌లో ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఈ నెల 7వ తేదీలోగా లిఖిత పూర్వకంగా తెలుపవచ్చని మున్సిపాలిటీ కమిషనర్ ఆల శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తన చాంబర్లో గుర్తింపు కలిగిన ఆయా రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఓటరు నమోదు, తొలగింపునకు సంబంధించి వ్యక్తిగతంగా దరఖాస్తులు అందజేస్తే తదుపరి చర్యలకు సిఫార్సు చేయడం జరుగుతుందన్నారు. ఓటరు బదిలీలకు సంబంధించి సైతం ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఈ నెల 7వ తేదీలోగా తమ అభ్యంతరాలను లిఖిత పూర్వకంగా తెలపాలని సూచించారు.
ఏ ఒక్క ఓటరుకు ఇబ్బంది కలగకుండా వారి సమీప ప్రాంతాల్లోనే పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేసే విధంగా కార్యాచరణ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులకు 32 వార్డులకు సంబంధించిన ఓటరు డ్రాఫ్ట్ జాబితాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ప్రెసిడెంట్ బెల్లం వేణుగోపాల్, కాంగ్రెస్ పార్టీ జిల్లా నేత బైరి హరినాథ్ బాబు, సిపిఎం నేత ఊరడి సుదర్శన్ రెడ్డి, సిపిఐ నేత దండి రంగారావు, ఈఎంసి అధికారులు శ్రీధర్ రెడ్డి, మణీ పాల్గొన్నారు.