కారేపల్లి, మే 28 : రైతు సంక్షేమం విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీ లేకుండా పని చేస్తుందని వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్‌నాయక్ అన్నారు. బుధవారం కారేపల్లి సోసైటీ కార్యాలయంలో రైతులకు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా సోసైటీ చైర్మన్ దుగ్గినేని శ్రీనివాసరావు ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతు పండించిన వరి ధాన్యానికి ఇస్తున్న బోనస్ రైతు భరోసా పెట్టుబడి పథకాన్ని మరిపిస్తుందన్నారు. వానాకాలం సీజన్లో కారేపల్లి మండలంలో 289 మంది రైతులకు రూ.73.60 లక్షల వరి బోనస్ వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు. యాసంగి సీజన్లో సైతం బోనస్ జమ కార్యక్రమం నడుస్తుందన్నారు. మండలంలో 5,249 మంది రైతులకు రూ.46.19 కోట్లు రుణమాఫీ జరిగిందన్నారు. రైతు భరోసా కింద ఇప్పటివరకు 1,500 మంది రైతులకు రూ.12.78 కోట్లు జమ అయ్యాయని తెలిపారు. రాష్ట్రం ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా రైతు సంక్షేమం విషయంలో రాజీ లేకుండా పని చేస్తుందన్నారు.
వైరాలో నిర్వహించిన ఉద్యోగ మేళతో నిరుద్యోగుల కండ్లలో అనందం తనకు సంతృప్తి ఇచ్చిందన్నారు. ఉద్యోగ మేళాకు 12 వేల మంది హాజరు కాగా 4,050 మందికి రూ.15 వేల నుండి రూ.60 వేల జీతభత్యాలు గల ఉద్యోగాలు ఇప్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైరా ఏడీఏ తుమ్మలపల్లి కరుణశ్రీ, ఎంపీడీఓ జి.సురేందర్, డిప్యూటీ తాసీల్దార్ వెంకటేశ్వర్లు, ఏఓ బి.అశోక్‌కుమార్, సోసైటి డైరక్టర్లు అడ్డగోడ ఐలయ్య, డేగల ఉపేందర్, కొత్తురి రామారావు, మర్సకట్ల రోషయ్య, మాజీ ఎంపీపీ బానోతు దేవ్లానాయక్, పగడాల మంజుల, మాజీ సోసైటీ చైర్మన్ ఈసాల నాగేశ్వరరావు, కార్యదర్శి బొల్లు హనుమంతరావు, సురేందర్ మనియార్, పొలగాని శ్రీనివాస్, ఎండీ.యాకూబ్ అలీ, మాలోతు కిశోర్ పాల్గొన్నారు.
Karepallli : రైతు సంక్షేమంలో రాజీ లేదు : వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్