‘నమస్తే తెలంగాణ’తో మధిర బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కమల్‌రాజు
మధిర, ఆగస్టు 22 : ‘సీఎం కేసీఆర్ చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయడానికి తనవంతు కృషి చేస్తున్నా. పార్టీ అభివృద్ధికి అహర్నిషలు కృషి చేయడంతోపాటు నిరంతరం నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటున్నా’ అని మధిర నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు అన్నారు. రెండోసారి సీఎం కేసీఆర్ తన పేరును ఎమ్మెల్యే అభ్యర్థిగాప్రకటించడాన్ని అదృష్టంగా భావిస్తున్నా. మధిర శాసనసభ అభ్యర్థిగా తనను ఖరారు చేసిన సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’కు కమల్‌రాజు పలు అభిప్రాయాలను వెల్లడించారు.
ప్రశ్న : జడ్పీ చైర్మన్‌గా ఉండి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏమిటి?
జవాబు : 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీఎం కేసీఆర్ తనకు జడ్పీ చైర్మన్ పదవిని అప్పగించారు. నాలుగేళ్ల పదవీ కాలంలో మంత్రి పువ్వాడ, ఎంపీ నామా, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ద్వారా కోట్లాది రూపాయలతో నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణాలు చేపట్టాం.
ప్ర : ప్రజలకు ప్రత్యేకంగా మీరు చేసిన సహకారం ఏమిటి?
జ : సీఎం కేసీఆర్ సహాయ నిధి నుంచి 2వేల మంది బాధితులకు సుమారు రూ.5కోట్ల విలువైన చెక్కులను అందజేశాం.
ప్ర : మధిర మున్సిపాలిటీ అభివృద్ధికి ఏం చేశారు?
జ : మూడేళ్లలో రూ.కోటితో అభివృద్ధి పనులు చేశాం. మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ద్వారా సీఎం కేసీఆర్ వంద పడకల ఆస్పత్రి, వెజ్, నాన్‌వెజ్ మార్కెట్, ట్యాంక్ బండ్ నిర్మాణం మంజూరు చేయించాం.
ప్ర : దళితుల అభివృద్ధి కోసం మీరు చేసిన ప్రయత్నం ఏమిటి?
జ : నియోజకవర్గం ఎస్సీకి రిజర్వ్ కావడంతో దళిత సామాజిక వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌కు అనేకమార్లు ఉపాధి కల్పన, దళితుల అభివృద్ధి కోసం తెలియజేశాను. సీఎం కేసీఆర్ మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకొని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. దీని ద్వారా 3,500 కుటుంబాలకు లబ్ధి చేకూరి ఉపాధి పొందుతున్నారు.
ప్ర : రెండోసారి టికెట్ రావడం ఎలా ఉంది?
జ : వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా నా విజయం నల్లేరు మీద నడకే. తెలంగాణ సిద్ధించిన తర్వాత మొదటిసారి జరిగిన ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి కేవలం 1,500 ఓట్లు మాత్రమే వచ్చాయి. రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేసి కేవలం 3,500 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాను. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేయడం వల్లే రెండోసారి టికెట్ ఖరారు చేశారు.
ప్ర : మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏం చేస్తారు?
జ : ఎమ్మెల్యేగా గెలిపిస్తే అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతా. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని లబ్ధిదారులకు అందేలా కృషి చేస్తా. జడ్పీ చైర్మన్‌గా ఉన్న నేను ఇక్కడున్న ఎమ్మెల్యే కంటే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి జరిగేలా కృషి చేశాను.