కూసుమంచి/ ఖమ్మం ఎడ్యుకేషన్, మార్చి 3: ఖమ్మం జిల్లాలో చేపట్టిన ‘మన ఊరు/ మన బస్తీ – మన బడి’ పనులను మే నెల నాటికి పూర్తి చేయాలని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి సూచించారు. ఖమ్మం నగరంతోపాటు కూసుమంచి, నేలకొండపల్లి మండలాల్లో శుక్రవారం పర్యటించిన ఆయన.. ఆయా పాఠశాలల్లో జరుగుతున్న ‘మన బడి’ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం కింద తొలి విడతగా రాష్ట్రంలోని 9,123 పాఠశాలలను రూ.3,471 కోట్లతో తీర్చిదిద్దుతున్నామన్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 410 పాఠశాలల్లో రూ.140 కోట్లతో వసతులు కల్పిస్తున్నామన్నారు. ఈ పనులు కూడా 60 శాతం పూర్తయ్యాయని, మిగిలినవి చివరి దశలో ఉన్నాయని వివరించారు.
‘మన బడి’ అద్భుతం
ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ, మామిళ్లగూడెం ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మన ఊరు మన బడి’ కార్యక్రమం అద్భుతమైనదని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన మౌలిక వసతులను కల్పించి వాటి రూపురేఖలు మార్చేందుకే సీఎం కేసీఆర్ ఈ అద్భుత కార్యక్రమాన్ని చేపట్టారని అన్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లు, వాటర్ ట్యాంక్‌కు నిర్మాణానికి, బల్లలు, ట్యాప్‌ల ఏర్పాటు ఎన్ని నిధులు వెచ్చించారని, నాణ్యతా ప్రమాణాలు ఏ మేరకు పాటించారని సంబంధిత ఇంజినీర్లను అడిగి తెలుసుకున్నారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థులతోనూ మాట్లాడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వం అందజేస్తున్న నిధులతోపాటు దాతలు ఎవరైనా ముందుకు వస్తే వారి సహకారం తీసుకోవాలని సూచించారు. ఖమ్మం నగరంలో అదనపు కలెక్టర్ స్నేహలత, డీఈవో సోమశేఖరశర్మ, ఈఈ నాగశేషు, ఎంఈవో శ్రీనివాస్, సెక్టోరల్ అధికారి సీహెచ్ రామకృష్ణ, ఉపాధ్యాయులు, కూసుమంచి, పాలేరులో ఎంఈవో బీవీ రామాచారి, హెచ్ఎంలు విక్రమ్‌రెడ్డి, కోటేశ్వరరావు, సర్పంచ్ మోహన్, టీచర్లు పాల్గొన్నారు.