అశ్వారావుపేట, మే 27 : అశ్వారావుపేటలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఉపఎన్నిక సోమవారం ప్రశాంతంగా ముగిసింది. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన రెండు పోలింగ్ కేంద్రాల్లో 76.28 శాతం ఓట్లు పోలయ్యాయి. మొత్తం ఓట్లు 1,263 ఉండగా 963 ఓట్లు పోలయ్యాయి. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు 144 సెక్షన్ అమలు చేశారు. పోలింగ్ నేపథ్యంలో శాంతి భద్రతలపై ఎప్పటికప్పుడు సిబ్బందికి సూచనలిస్తూ ఎస్సై శ్రీరాముల శ్రీను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించారు. తహసీల్దార్ పి.కృష్ణ ప్రసాద్ పోలింగ్ సరళిని పరిశీలించారు.
అన్నపురెడ్డిపల్లి, మే 27 : మండలంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతగా ముగిశాయి. మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రంలో పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉదయం 8 గంటల నుంచి బారులు తీరారు. పోలింగ్ సరళిని ట్రైనీ ఐపీఎస్ అధికారి విక్రాంత్ కుమార్‌సింగ్, కొత్తగూడెం ఆర్డీవో మధు, తహసీల్దార్ జగదీశ్వర్ ప్రసాద్ పరిశీలించారు. పోలింగ్ శాతం 70.10గా నమోదైంది.

టేకులపల్లి, మే 27 : మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఈ కేంద్రాలను తహసీల్దార్, సీఐ, ఎస్ఐలు పరిశీలించారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ కేంద్రాలను పరిశీలించారు. పీఎస్ నెం.252లో మాజీ ఎమ్మెల్యే హరిప్రియనాయక్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
చండ్రుగొండ, మే 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ మండలంలో ప్రశాంతంగా ముగిసింది. సోమవారం ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటుహక్కు కోసం బారులు తీరారు. స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కేంద్రంలో ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకున్నారు. మండలంలో 71శాతం మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ట్రైనీ ఎస్పీ విక్రమ్‌కుమార్ సింగ్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఎంపీడీవో అశోక్ పోలింగ్ కేంద్రంలో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఎస్సై మాచినేని రవి బందోబస్తును పర్యవేక్షించారు.
ములకలపల్లి , మే 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలంలో 66.70శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ సరళిని స్థానిక బీఆర్ఎస్ నాయకులు, ప్రజాప్రతినిధులతో అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు అడిగి తెలుసుకున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వైపు మొగ్గు చూపారని తాటికి స్థానిక నాయకులు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సున్నం నాగమణి, మట్ల నాగమణి, బైటి రాజేశ్, వాడే నాగరాజు, సున్నం సుశీల, శనగపాటి సీతరాములు, పుష్పాల హనుమంతరావు, సున్నం బాబురావు, పుష్పాల సాయి, యేసుపాక వెంకటేశ్వర్లు, పుష్పాల సాయి ఉన్నారు.

ఇల్లెందు రూరల్, మే 27 : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సోమవారం ఇల్లెందు గోవింద్‌సెంటర్‌లోని బాలికల ఉన్నత పాఠశాల, జేకే కాలనీలోని సింగరేణి స్కూల్ గ్రౌండ్లలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటు వేయడానికి కేంద్రానికి వచ్చిన పట్టభద్రులు ఈవీఎం మిషన్ల దగ్గర చీకటిగా ఉండడంతో కొంత తడబాటుకు గురయ్యామని యువత విలేకర్లకు వివరించారు. చంటిపిల్లలతో యువతులు కేంద్రానికి ఓటు వేసేందుకు బారులు తీరారు. సాయంత్రం 4 గంటల వరకు 70.53శాతం ఓటు నమోదు అయిందని ఎన్నికల అధికారులు వెల్లడించారు.
దమ్మపేట, మే 27 : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో మండలంలో 71.68 శాతం పోలింగ్ నమోదైంది. మండలంలో 264, 265 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 264లో 1,021ఓట్లల్లో 734 ఓట్లు పోలయ్యాయి. 265లో 631 ఓట్లల్లో 447 ఓట్లు పోలయ్యాయి. దమ్మపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. బీఆర్ఎస్ దమ్మపేట మండల ప్రధాన కార్యదర్శి దొడ్డా రమేష్ తన భార్య పూజితతో కలసి ఓటు హక్కును వినయోగించుకున్నారు.