ఖమ్మం, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మాజీ ఎంపీ పొంగులేటి చాలెంజ్‌కు తాము సిద్ధమని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు స్పష్టం చేశారు. ఎవరి బలం ఏమిటో ఎన్నికల్లో తేల్చుకుందామని సవాల్ విసిరారు. సీఎం కేసీఆర్ ముందు పొంగులేటి పాచికలు పారవని అన్నారు. ఖమ్మం జిల్లా ప్రజలు ధన రాజకీయాలకు లొంగేవారు కాదనే విషయాన్ని ఆయన గ్రహించాలని సూచించారు. ఖమ్మంలోని తెలంగాణ భవన్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయ పరిపక్వతలేని పొంగులేటి అహంభావ పూరిత ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మెడను తానే కోసుకుంటున్న విషయాన్ని పొంగులేటి గ్రహించాలని.. ఆయన మెడను కోయాల్సిన అవసరం కేసీఆర్‌కు ఏమీ లేదని స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో పొంగులేటే అనేకమంది మెడలు కోసిన విషయాన్ని జిల్లా ప్రజలు మర్చిపోలేదని అన్నారు. పాలేరులో తుమ్మల నాగేశ్వరరావును, మధిరలో లింగాల కమల్‌రాజును, వైరాలో మదన్‌లాల్‌ను, కొత్తగూడెంలో జలగం వెంకట్రావును, కూరాకుల నాగభూషణాన్ని ఓడించింది పొంగులేటి కాదా? అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి ఖమ్మంలో ఏ ఒక్కరినీ అసెంబ్లీ గేటు తాకనీయబోనని పొంగులేటి విసిరిన సవాల్‌ను తాము స్వీకరిస్తున్నామని, ఎవరు ఏమిటో ఎన్నికల్లో తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని అన్నా రు. వందమంది పొంగులేటిలొచ్చినా కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ను ఏమీ చేయలేరని స్పష్టం చేశా రు. పొంగులేటికి నిజంగా ప్రజాబలమే ఉంటే ఆయనను నమ్ముకున్న పాయం వెంకటేశ్వర్లు, తాటి వెంకటేశ్వర్లు, తెల్లం వెంకట్రావు, మదన్‌లాల్, లింగాల కమల్రాజులను ఎందుకు గెలిపించలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌తో సాన్నిహిత్యంగా ఉండి ప్రయోజనాలు పొంది మీరు.. ఈ రోజున ఆయనను రావణాసురుడు అని సంబోధించడం సరైంది కాదని అన్నారు. ఎంపీగా ఉన్న సమయంలో ఏ రోజూ జిల్లా ప్రజల సమస్యలను ప్రస్తావించని పొంగులేటి.. ఈ రోజున జిల్లాకు ఏదో చేశానని మాట్లాడుతుండడం విడ్డూరంగా ఉందని అన్నారు. ధన రాజకీయాలను జిల్లా ప్రజలు సహించరని, జన రాజకీయాలను మాత్రమే స్వాగతిస్తారని అన్నారు.
డబ్బు ధీమాతోనే అహంకారపు మాటలు : సండ్ర
సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ.. పొంగులేటి స్కూటర్‌పై తిరిగే రోజుల్లోనే తాను ఎమ్మెల్యేనని అన్నారు. డబ్బు ధీమాతో ఆయన అహంకారంగా మాట్లాడడం సరికాదని అన్నారు. తన రెక్కల కష్టం, ప్రజల ఆశీర్వాదం వల్లే తాను ఎమ్మెల్యేగా గెలిచాను తప్ప మరెవరి మోచేతి నీళ్లు తాగి కాదని అన్నారు. మధిర అభ్యర్థిగా రాంబాబును పొంగులేటి ప్రకటించారని, ఒకవేళ పొంగులేటి కాంగ్రెస్‌లో చేరితే ‘భట్టి’కి టికెట్ రాదా? అని ప్రశ్నించారు. నిబద్ధత, నిజాయితీ లేని వ్యక్తి పొంగులేటి అని మండిపడ్డారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ పార్టీ కన్న తల్లి లాంటిదని, పార్టీకి ద్రోహం చేశారంటే కన్నతల్లికి ద్రోహం చేసినట్టేనని అన్నారు. కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా, డీసీసీబీ చైర్మన్లు బచ్చు విజయ్‌కుమార్, కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ కమర్తపు మురళి, ఉద్యమకారుడు డోకుపర్తి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.