ఇల్లెందు రూరల్, అక్టోబర్ 3:రాష్ట్ర మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు తెలుగు సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని బీఆర్ఎస్ మహిళా విభాగం ఇల్లెందు మండల నాయకులు, కౌన్సిలర్లు విమర్శించారు. సాక్షాత్తూ మహిళా మంత్రిగా ఉన్న ఆమె.. సాటి మహిళపై తప్పుడు వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. ఈ వ్యాఖ్యలను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు.
ఈ మేరకు మహిళా మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ భద్రాద్రి జిల్లా ఇల్లెందులోని తెలంగాణతల్లి విగ్రహం వద్ద గురువారం వారు ఆమె దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మహిళా నాయకులు మాట్లాడుతూ.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ.. సినీ నటి సమంత గురించి తప్పుడు వ్యాఖ్యలు చేయడం శోచనీయమని అన్నారు.
అలాగే, మాజీ మంత్రి కేటీఆర్, నటుడు నాగర్జునల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా మాట్లాడడం సరికాదని అన్నారు. తక్షణమే వారికి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మూసీ నది కంటే కాంగ్రెస్ నాయకుల నోళ్లే కంపు కొడుతున్నాని విమర్శించారు. తొలుత వారే వారి నోళ్లను పినాయిల్తో శుభ్రం చేసుకోవాలని హితవుచెప్పారు. కటకం పద్మావతి, సిలివేరు అనిత, సందా బిందు, చీమల సుజాత, పోబోలు స్వాతి, ఖమ్మంపాటి రేణుక, కొక్కు సరిత, గండ్రాతి చంద్రావతి, నారాయణమ్మ, పూనెం కమల పాల్గొన్నారు.