కూసుమంచి, ఆగస్టు 6 : గురుకుల పాఠశాలల్లో విద్యార్థులకు చదువుతోపాటు నాణ్యమైన ఆహారం అందించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, ఇందుకోసం నిత్యం పర్యవేక్షణ ఉండాలని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ టెక్నాలజీ (సైట్) డైరెక్టర్ విజయలక్ష్మీబాయి అన్నారు. కూసుమంచిలోని కేజీబీవీని బుధవారం సందర్శించిన ఆమె.. తరగతి గదులు, కిచెన్, టాయిలెట్స్, పరిసరాలు, స్టోర్ రూమ్‌ను పరిశీలించి పలు సూచనలు చేశారు.
తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందిస్తున్న మెనూ గురించి అడిగి తెలుసుకున్నారు. కొన్నిచోట్ల ఆహార పదార్థాల విషయంలో వస్తున్న వార్తలతో కళాశాలలు, పాఠశాలల్లో రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నామని తెలిపారు. మెనూ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు రోజువారీగా ఆహార పదార్థాల గురించి అడిగి తెలుసుకున్నారు.
కిచెన్‌తోపాటు స్టోర్‌లోని నిత్యావసరాల స్టాక్‌ను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం సీఎంవో రాజశేఖర్ మాట్లాడుతూ బాలికలకు ప్రత్యేకంగా కేటాయించిన కేజీబీవీల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందు నుంచే కామన్ పరీక్షలకు విద్యార్థులను సంసిద్ధులను చేయాలని సూచించారు. ఇన్చార్జి రాజకుమారి, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.