ఖమ్మం వ్యవసాయం, జనవరి 15: ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో బుధవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. గడిచిన ఐదు రోజులుగా మార్కెట్‌కు వారాంతపు, సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం తిరిగి మార్కెట్లో యథావిథిగా క్రయవిక్రయాలు కొనసాగనున్నాయి. ఈ తరుణంలో బుధవారం రాత్రి ఓ షెడ్డులో అగ్నిప్రమాదం చోటుచేసుకోవడంతో క్షణాల్లో దాదాపు 8 వందలకు పైగా పత్తి బస్తాలు కాలి బూడిదయ్యాయి. అయితే ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
అగ్ని ప్రమాదం విషయం తెలుసుకున్న త్రీటౌన్, ఇతర ప్రాంతాల పోలీస్ అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అగ్నిమాపక వాహనాల సహాయంతో మంటలను ఆర్పారు. ప్రస్తుతం మార్కెట్లో అగ్నిమాపక వాహనం అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతం నుంచి వాహనం వచ్చేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని మార్కెట్ సిబ్బంది, ఏఎంసీ బాధ్యుల నిర్లక్ష్యమే కారణమని వ్యాపారులు పరస్ఫరం ఆరోపించుకున్నారు. అయితే, ఆకతాయిలు సిగరెట్, బీడీలు తాగి వాటిపై పడేసి ఉంటారని మార్కెట్ సిబ్బంది అనుమానిస్తున్నారు. నిరుడు సైతం తెల్లవారుజామున ఇదే పత్తి మార్కెట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో వందలాది పత్తి బస్తాలు కాలిబూడిదయ్యాయి. బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో ఇద్దరు పత్తి ఖరీదుదారులకు సంబంధించి 8 వందల బస్తాలు కాలి బూడిదైనట్లు సమాచారం. దాదాపు రూ.35 లక్షల నష్టం వాటిల్లినట్లు ఖరీదుదారులు వాపోయారు.
ఖరీదుదారులకు గోడౌన్లుగా మారిన షెడ్లు
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లోని ప్రధాన షెడ్లు ఖరీదుదారులకు గోడౌన్లుగా మారాయి. ప్రస్తుతం మార్కెట్ పరిధిలో మూడు యార్డులు అందుబాటులో ఉన్నాయి. ఒకటి మిర్చి క్రయవిక్రయాలకు ఉపయోగిస్తుండగా, మరో యార్డులో పత్తి, అపరాల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇకపోతే మూడో షెడ్లో మిర్చి ఖరీదుదారులు కొనుగోలు చేసిన పంటను ఆరబెట్టుకునేందుకు, లారీలో పంటను లోడ్ చేసుకునేందుకు వినియోగిస్తున్నారు. పత్తి యార్డును సైతం పత్తి ఖరీదుదారులు తమ సొంత గౌడ్లుగా ఉపయోగిస్తున్నారు.
సాధారణంగా ఏరోజు కొనుగోలు చేసిన పంటను అదేరోజు వ్యాపారులు తమ సొంత వాహనాలలో ఇతర ప్రాంతాలకు గాని, గోడౌన్లకు గాని తరలించాల్సి ఉంటుంది. వరంగల్ ఏనుమాముల మార్కెట్లో సైతం ఇదే విధానం కొనసాగుతున్నది. కానీ.. ఖమ్మం ఏఎంసీలో మాత్రం ఖరీదుదారులు ఏండ్ల తరబడి షెడ్లను గోడౌన్లుగా మార్చుకోవడంతో ప్రమాదం జరిగిన ప్రతిసారి మార్కెట్ నిధుల నుంచి నష్టపరిహారం అందించడం పరిపాటిగా మారింది. నిరుడు కూడా ఇదే తీరులో ప్రమాదం జరిగినప్పటికీ అధికారులు చర్యలు చేపట్టకపోవడం గమనార్హం.
రూ.కోటి వెచ్చించినా ‘ఫైర్’ సేవలు కరువు
రాష్ట్రంలోనే అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న ఖమ్మం మార్కెట్లో అగ్నిమాపక సేవలు అందుబాటులో లేకుండాపోయాయి. గత కొద్ది సంవత్సరాల క్రితం నాటి సర్కార్ అగ్నిమాపక భవనం నిమిత్తం రూ.55 లక్షలు వెచ్చించి నిర్మాణం పూర్తి చేసింది. మరో రూ.50 లక్షలు వెచ్చించి కొత్త వాహనాన్ని సైతం కొనుగోలు చేశారు. నాటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాహనం, భవనాన్ని ప్రారంభించారు. ఏమైందో ఏమో తెలియదు కానీ మూడు నెలలు గడవకమందే వాహనం కనిపించకుండా పోయింది. సీజన్ వచ్చిన ప్రతిసారి మీడియాలో కథనాలు ప్రచురితమైన సందర్భంలో అలా వాహనం కనిపించడం తర్వాత కనపడకుండా పోవడం సర్వసాధారణమైంది. ఆయిలింజన్ సహాయంతో నీటిని పంపుచేసే పరికరాలు యార్డులో ఉన్నప్పటికీ బుధవారం ఆపరేట్ చేసే సిబ్బంది లేకపోవడంతో తీవ్రనష్టం జరిగింది.
ఏఎంసీని సందర్శించిన ఎమ్మెల్సీ మధు
ఖమ్మం వ్యవసాయం, జనవరి 15: నగరంలోని పత్తి యార్డును బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు బుధవారం రాత్రి సందర్శించారు. పార్టీ నేతలు నాగరాజు, ఆర్జేసీ కృష్ణ తదితర ముఖ్య నాయకులతో కలిసి యార్డును కలియతిరిగిన తాతా మధు.. మార్కెటింగ్, పోలీసు, అగ్నిమాపక శాఖ, వ్యాపారులతో మాట్లాడారు. ప్రమాదానికి గల కారణాలతోపాటు ఎంత మేర నష్టం జరిగింది? పంట రైతులకు చెందిందా? వ్యాపారులదా? అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దోషులు ఎవరైనా కఠినంగా శిక్షించాలని, నూతన పాలకవర్గం ఇలాంటి పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు డెడికేటెడ్ ఫైర్ ఇంజిన్‌ను మార్కెట్‌కు కేటాయించాలని, ముఖ్యంగా సీసీ కెమెరాలు పనిచేయడం లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయన్నారు. ఘటనపై పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.