ఖమ్మం/ సత్తుపల్లి/ మణుగూరు టౌన్/ దమ్మపేట, జూన్ 8: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం.. పార్టీకి తీరని లోటంటూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు విచారం వ్యక్తం చేశారు. గుండెపోటుతోపాటు తీవ్ర అస్వస్థతకు గురై నాలుగు రోజులుగా హైదరాబాద్ ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గోపీనాథ్.. ఆదివారం ఉదయం ప్రాణాలు విడిచారన్న వార్త తెలుసుకున్న జిల్లా నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ మేరకు పలువురు నేతలు హైదరాబాద్ మాదాపూర్‌లోని గోపీనాథ్ నివాసంలో ఆయన పార్థీవదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మరికొందరు నేతలు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం వ్యక్తం చేశారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు, సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తదితరులు ఆదివారం హైదరాబాద్ వెళ్లి గోపీనాథ్ భౌతికకాయాన్ని సందర్శించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.
Khammam3
రఘునాథపాలెం మండలం ఈర్లపూడిలో ఆదివారం జరుగనున్న వైరా మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్ దశదిన కర్మల కార్యక్రమానికి బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ రావాల్సి ఉంది. ఉదయం మాగంటి గోపీనాథ్ మృతిచెందడంతో కేటీఆర్ ఖమ్మం పర్యటన రద్దయింది. కాగా, హైదరాబాద్‌లో గోపీనాథ్‌కు నివాళులర్పించిన జిల్లా నేతలు.. మాగంటి కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. గోపీనాథ్ పవిత్రాత్మకు శాంతి చేకూర్చాలని భగవంతుడిని ప్రార్థించారు.
అలాగే, బీఆర్ఎస్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షలు తాతా మధు, రేగా కాంతారావు, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, భద్రాద్రి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, రైతుబంధు సమితి భద్రాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు రావు జోగేశ్వరరావు తదితరులు వేర్వేరు ప్రకటనల్లో సంతాపం తెలిపారు.