ఖమ్మం/కొత్తగూడెం టౌన్, జూన్ 8 : మండే ఎండకు రోళ్లు పగిలిపోయే రోహిణి కార్తె నుంచి వర్షాలతో చల్లదనాన్ని ఆహ్వానించే మృగశిర కార్తెలోకి అడుగు పెట్టాం. కార్తె తొలిరోజే వర్షం ఉమ్మడి జిల్లాను పలకరించింది. మృగశిర కార్తె రోజు చేపల కూర తినడం ఆనవాయితీగా వస్తోంది. దానిని కొనసాగిస్తూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు మృగశిర కార్తె రోజు శనివారం చేపలు కొనేందుకు పోటీపడ్డారు. మార్కెట్లతోపాటు ఎక్కడ చూసినా చేపల విక్రయాలు జోరుగా సాగాయి.
ఖమ్మం నగరంలోని బైపాస్ రోడ్, డీఆర్డీఏ, కాల్వొడ్డు, గాంధీచౌక్, ముస్తపా నగర్, ప్రకాశ్‌నగర్, ఇందిరానగర్, ఖానాపురం హవేలి, చర్చి కాంపౌండ్ తదితర ప్రాంతాల్లో చేపల కొనుగోలుదారులతో సందడి నెలకొంది. కొత్తగూడెం హెడ్డాఫీస్, పెద్దబజార్ రైల్వే స్టేషన్ పక్క సందు, పాల్వంచ, జూలూరుపాడు, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, రుద్రంపూర్‌లోని ప్రధాన సెంటర్లలో చేపలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఎగబడ్డారు. ఖమ్మంలో తెల్ల చేపలు కిలో ధర రూ.220-250 ఉండగా.. నల్ల చేపలు రూ.400 నుంచి 500 పలికాయి. ఈ ఏడాది జిల్లాలోని పలు ప్రాంతాల్లో చెరువులు ఎండిపోవడంతో వ్యాపారులు ఆంధ్రా నుంచి తీసుకొచ్చి విక్రయాలు చేపట్టారు. గ్రామీణ ప్రాంతాల్లో సైతం కొన్నిచోట్ల చెరువుల వద్ద సందడి నెలకొంది.