ఖమ్మం వ్యవసాయం/కూసుమంచి/అన్నపురెడ్డిపల్లి/అశ్వారావుపేట రూరల్, డిసెంబర్ 24 : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై పడింది. ఇప్పటికే పొరుగునున్న ఆంధ్రప్రదేశ్లోని ఖమ్మం జిల్లా సరిహద్దు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ ప్రభావం ఉమ్మడి ఖమ్మం జిల్లాపై కూడా స్వల్పంగా పడింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం నుంచి సూర్యుడి జాడ కరువైంది.
దీంతో జిల్లాలో దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. మధ్యాహ్నం తరువాత ఖమ్మం నగరంతోపాటు పలు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన జల్లులు కురిశాయి. దీంతో అప్రమత్తమైన అన్నదాతలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ ఉంచిన ధాన్యాన్ని కాపాడుకునేందుకు ఉరుకులు పరుగులు పెట్టారు. ప్రస్తుతం వరి, పత్తి పంటలు ఇప్పటికే చేతికొచ్చాయి. మరికొద్ది రోజుల్లో మిర్చి పంట కూడా చేతికి రానుంది. ఇదే సమయంలో తుఫాన్ ప్రభావం ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు.
దీంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ అల్పపీడనం కారణంగా ఒకవైపు చలి తీవ్రత పెరుగుతోంది. మరోవైపు ఈదురుగాలులతో కూడిన జల్లులు కురుస్తున్నాయి. ఉదయం నుంచి మబ్బులు పట్టి ఉన్న వాతావరణం ఒక్కసారిగా చల్లబడి మధ్యాహ్నం తరువాత చిరు జల్లులు కురవడంతో కూసుమంచి, అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట మండలాల రైతులు అప్రమత్తమయ్యారు. పలు గ్రామాల్లోని రైతులు వెంటనే కల్లాలకు పరుగులు పెట్టారు. అక్కడున్న తమ ధాన్యం తడవకుండా వాటిపై పట్టాలు కప్పారు. కొన్ని చోట్ల ఆరబెట్టిన ధాన్యాన్ని ఏకంగా బస్తాల్లోకి ఎత్తి తడవని ప్రాంతాల్లోకి తరలించారు.