ఖమ్మం, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్) బుధవారం ఖమ్మం రానున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను సన్మానించేందుకు కేటీఆర్ ఖమ్మం వస్తున్నారు. బుధవారం ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయలుదేరే కేటీఆర్.. ఉదయం 11:30 గంటలకు ఖమ్మానికి చేరుకుంటారు. బైపాస్ రోడ్డు నుంచి ఖమ్మం నగరంలోని గట్టయ్య సెంటర్లో గల బీఆర్ఎస్ జిల్లా కార్యాలయమైన తెలంగాణ భవన్‌కు చేరుకుంటారు.
మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఆధ్వర్యంలో వెయ్యి బైకులతో కేటీఆర్‌కు ఘన స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు ఏర్పాట్లు చేశారు. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియం నుంచి తెలంగాణ భవన్ వరకు భారీ ర్యాలీ చేపట్టి కేటీఆర్‌కు స్వాగతం పలకనున్నారు. ఈ మేరకు అజయ్‌కుమార్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఖమ్మానికి వచ్చే నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు తెలంగాణ భవన్ వద్ద భోజన ఏర్పాట్లు చేశారు.
తెలంగాణ భవన్లో ప్రత్యేకంగా షామియానాలు ఏర్పాటు చేశారు. ఖమ్మం జిల్లాకు బీఆర్ఎస్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్, మాజీ జడ్పీటీసీలు, మాజీ ఎంపీపీలతోపాటు ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొననున్నారు. వీరితోపాటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ముఖ్య కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. తెలంగాణ భవన్లో సర్పంచ్‌లు, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమం అనంతరం రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంట్లో కేటీఆర్ భోజనం చేయనున్నారు. అనంతరం తిరిగి రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ వెళ్లనున్నారు.
సైకిల్‌పై బీఆర్ఎస్ అభినందన సభకు..
భద్రాచలం, జనవరి 6: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌పై ఉన్న వీరాభిమానంతో భద్రాచలం పట్టణానికి చెందిన ఆ పార్టీ నాయకుడు ప్రకాశ్ ఖమ్మంలో బుధవారం జరుగనున్న బీఆర్ఎస్ అభినందన సభకు సైకిల్‌పై బయలుదేరాడు. మంగళవారం భద్రాచలం నుంచి బయలుదేరిన ఆయన బుధవారం అభినందన సభ వేదిక వద్దకు చేరుకుంటారు.