మామిళ్లగూడెం, జూన్ 17: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు ప్రక్రియను నిరంతరం కొనసాగిస్తూ జిల్లాను అన్నింటా అగ్రభాగాన నిలిపేందుకు సమష్టి కృషి అవసరమని ఖమ్మం కలెక్టర్‌గా పనిచేసి సివిల్ సప్లయీస్ డైరెక్టర్, చీఫ్ రేషనింగ్ ఆఫీసర్‌గా బదిలీపై వెళ్తున్న ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బదిలీపై హైదరాబాద్ వెళ్తున్న ముజమ్మిల్ ఖాన్‌కు ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత కలెక్టరేట్‌కు చేరుకున్న ముజమ్మిల్ ఖాన్‌కు గిరిజన సంక్షేమ డిగ్రీ కళాశాల విద్యార్థులు, ఎన్సీసీ కేడెట్స్, ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికారు. జిల్లాలో కలెక్టర్‌గా ముజమ్మిల్ ఖాన్ ఆధ్వర్యంలో జరిగిన అభివృద్ధి, ప్రగతిని ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు. అనంతరం బదిలీపై వెళ్తున్న ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ ఖమ్మం నేల చాలా పవిత్రమైనదని, ఇక్కడ పని చేయడం వల్ల చాలా సంతృప్తి లభించిందన్నారు. వరదల సమయంలో ఇక్కడి అధికారులు, సిబ్బంది అద్భుతంగా పని చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మేరకు అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను జిల్లా ప్రజలకు అందించామన్నారు.
ప్రజలు, ప్రజాప్రతినిధుల సహాయ సహకారాలతో కలెక్టర్‌గా పనిచేసిన 12 నెలల కాలంలో గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు ప్రజలకు సేవచేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి అధికార యంత్రాంగం ఎంతో ఉత్సాహంగా పని చేసిందన్నారు. తర్వాత ముజమ్మిల్ ఖాన్ సమయంలో జరిగిన కార్యక్రమాలపై రూపొందించిన ఏవీని ప్రదర్శించారు. ముజమ్మిల్ ఖాన్‌ను వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉన్నతాధికారులు, మండల అధికారులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సీపీ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డి, నగర పాలక సంస్థ కమిషనర్ అభిషేక్ అగస్త్య, జిల్లా అటవీ శాఖ అధికారి సిద్ధార్థ విక్రమ్‌సింగ్, జడ్పీ సీఈవో దీక్షారైనా, ఆర్డీవోలు నర్సింహారావు, రాజేందర్, కలెక్టరేట్ ఏవో, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.