భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): ఒకప్పుడు వ్యవసాయమంతా ప్రకృతి సిద్ధంగా జరిగేది. రైతులు సాగుకు ముందు పశువుల పెంటను భూమిపై వేసేవారు. సహజ సిద్ధంగా తయారు చేసిన మిశ్రమాలను పిచికారీ చేసి తెగుళ్లను నివారించేవారు. కాలక్రమేణా ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు సాగులో ఎడాపెడా రసాయనిక మందుల వాడకం పెరిగింది. కొందరు రైతులు అవసరమైన మోతాదు కంటే ఎక్కువ మోతాదులో పెస్టిసైడ్స్ వినియోగిస్తున్నారు. దీంతో నేల భూసారాన్ని కోల్పోతున్నది. పండించిన పంటా విషతుల్యమవుతున్నది. రసాయనిక పంటల వినియోగంతో ఏటికేడు పంటల దిగబడులు తగ్గుతున్నాయి.
మానవ జీవితాలపై ప్రభావం..
పంటలపై రసాయనిక మందుల వినియోగం మానవ జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం రైతులు వరి సాగులో ఆడమగ, బాసుమతి వంటి ఎన్నో రకాల వంగడాలు సాగు చేస్తున్నారు. వరిలో రసానియక మందుల వినియోగంతో భూమి సారం కోల్పోవడమే కాక భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. ఒక హెక్టార్ వరి సాగు చేస్తే దాని ద్వారా 1,488 కిలోల కార్బన్ డై ఆక్సైడ్ విడుదలవుతుందని శాస్త్రవేత్తల అంచనా. ఈ వాయువు విడుదలవుతుండడంతో ప్రకృతి సమతుల్యత దెబ్బతింటున్నది. కాబట్టి వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలు సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. మితిమీరిన రసాయన ఎరువుల వినియోగంపై ఏటా వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. రైతాంగం మాత్రం ప్రైవేటు పెస్టిసైడ్ కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి అవసరమైన దాని కంటే అధిక మోతాదులో పురుగు మందులు వినియోగిస్తున్నారు.
కొయ్యలు కాల్చొద్దు..
పొలంలో కొయ్యలను కాల్చడం మంచిది కాదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. కొయ్యలు కాల్చివేసే క్రమంలో భూమి గట్టిపడిపోతుంది. భూమి గట్టిపడితే దున్నే సమయంలోఇబ్బంది పెడుతుంది. పొలాన్ని కలియదున్నడం కష్టతరమవుతుంది. కొయ్యలు కాలిస్తే భూమిలోని మిత్ర సూక్ష్మజీవులు, వానపాములు చనిపోతాయి. భూమి గుల్ల బారదు. దీంతో నాట్లు వేసిన తర్వాత పంటకు సరిగా పోషకాలు అందవు. పైరు దెబ్బతింటుంది.
జిల్లాలో ఎరువుల వినియోగం ఇలా..
జిల్లాలో రసాయనాల వాడకం విచ్చలవిడిగా కొనసాగుతున్నది. అతిగా యూరియా వినియోగం జరుగుతున్నది. ఈ వానకాలం, గత యాసంగిలో రైతులు యూరియా 24,245 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ- 1360 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 11,686 మెట్రిక్ టన్నులు, ఎంవోపీ 967 మెట్రిక్ టన్నులు. ఎస్ఎస్పీ 1,646 మెట్రిక్ టన్నులు వినియోగించారు. ఎకరానికి యూరియా 50 కిలోల వరకు వినియోగించాల్సి ఉండగా 150 నుంచి 200 కిలోల వరకు వినియోగిస్తున్నారు. పొలాల్లో వేసిన యూరియా భూగర్భజలాలకు చేరి దాని తర్వాత నైట్రేట్‌గా మారిపోతుంది. నైట్రేట్‌తో బ్లూబేది సిండ్రోమ్ వచ్చే అవకాశం ఉంది.
సేంద్రియ సాగుతో మేలు..
రైతులు అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడొద్దు. క్రిమి సంహారక మందులు భూమికి హాని చేస్తాయి. భూసారం తగ్గుతుంది. రైతులు వాడే పెస్టిసైడ్స్‌లో కనీసం 25శాతమైనా సేంద్రియ ఎరువులు వాడాలి. సేంద్రియ వ్యవసాయమే రైతులకు అన్ని విధాలా మేలు.
– డాక్టర్ లక్ష్మీనారాయణమ్మ, కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్, కొత్తగూడెం
ఎరువుల్లో ఇలా..
రైతులు పొలాల్లో వేసే యూరియాలో 48 శాతం మాత్రమే నత్రజని ఉంటుంది. మిగతా 52 శాతం లవణాలు, క్షారాలు ఉంటాయి. సూపర్ పాస్ఫేట్లో 16 శాతం పాస్ఫేట్ ఉంటుంది. 84 శాతం క్షారాలు ఉంటాయి. పొటాషియం సల్ఫేట్లో 48 శాతం పొటాష్ ఉంటుంది. మిగతా 52 శాతం క్షారాలు ఉంటాయి. లవణాలు, క్షారాలు మట్టి కణాల మధ్య చేరి భూగర్భ నీటితో కలిసినప్పుడే అమోనియా కార్బన్ డై ఆక్సైడ్‌గా మారుతుంది. మట్టి కణాల మధ్య ఖాళీలన్నీ లవణాలు, క్షారాలతో నిండిపోతాయి. సిమెంట్, కంకరలా మట్టి కణాలను బంధిస్తాయి. ఈ కారణంగా వర్షపు నీరు నేలలో ఇంకదు. దీంతో నేల సత్తుబడి పోతుంది. క్రమంగా భూమి బంజరు భూమిగా మారుతుంది.