మామిళ్లగూడెం, అక్టోబర్ 19: చేతి వృత్తిదారులు, కుల వృత్తులు చేసుకుంటున్న వారికి సీఎం కేసీఆర్ చేయూతనిస్తున్నారు. వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. దీనిలో భాగంగా కుమ్మరి వృత్తిలో కొనసాగుతున్న వారికి అధునాతన యంత్రాలను రాయితీపై అందిస్తున్నారు. వృత్తిలో నైపుణ్యాలను మెరుగుపరుచుకునే విధంగా శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. ముందస్తుగా నైపుణ్యాలపై శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లకు టూల్ కిట్లు అందజేశారు.
పథకం అమలు ఇలా..
శిక్షణ పొందిన 10 మంది ట్రైనర్లకు ప్రభుత్వం 80శాతం రాయితీపై ఎలక్ట్రిక్ పోటరీ వీల్, పగ్ మిల్, హాండ్ ఆపరేటింగ్ దియా మేకింగ్ మెషిన్లు పంపిణీ చేసింది. అందుకు ప్రభుత్వం రూ.10 లక్షలు వెచ్చించింది. శిక్షణ పొందిన వారిలోనూ గడిచిన ఐదేళ్లలో ఏ ఇతర శాఖల నుంచి ప్రభుత్వ రుణం పొందని వారికే అవకాశం కల్పించారు. ఒకే కుటుంబంలో మాస్టర్ ట్రైనర్లు భార్య, భర్త ఉంటే అధికారులు వారిలో ఒకరిని మాత్రమే లబ్ధిదారుగా ఎంపిక చేశారు. తొలుత జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి ్లటూల్ కిట్లు కొనుగోలుకు వాటిని సరఫరా చేసే ఏజెన్సీల ద్వారా కొటేషన్లు స్వీకరించింది. ప్రభుత్వం విడుదల చేసిన బడ్జెట్ మేరకు టూల్ కిట్లు కొనుగోలు చేసింది. ట్రైనర్లు మట్టి గణపతులు, వాటర్ బాటిళ్లు, దీపాల తయారీలో శిక్షణ పొందారు. మొత్తం 10 మంది శిక్షణ తీసుకోగా వీరిలో ఇద్దరు భార్యాభర్తలు. దీంతో అధికారులు తొమ్మిది మందిని లబ్ధిదారులుగా ఎంపిక చేసి మంత్రి అజయ్‌కుమార్ చేతుల మీదుగా టూల్ కిట్లు అందజేశారు. ఒకొకరికీ రూ.లక్ష విలువ చేసే పనిముట్లు మట్టి తొకే యంత్రం, మట్టి కలిపే యంత్రం, దీపాలు తయారు చేసే యంత్రాలు అందాయి.
ప్రభుత్వ నిబంధనల మేరకు పంపిణీ..
జిల్లావ్యాప్తంగా 10 మాస్టర్ ట్రైనర్లతో పాటు మరో 90 మంది వృత్తిదారులు కుండలు, విగ్రహాలు, దీపాల తయారీపై శిక్షణ పొందారు. మొదటి విడతలో మాస్టర్ టైనర్లకు టూల్ కిట్లు మంజూరయ్యాయి. ప్రభుత్వం అనుమతులు వచ్చిన తర్వాత మిగతా వారికి యూనిట్లు అందుతాయి.
– జి.జ్యోతి, జిల్లా బీసీ సంక్షేమాధికారి, ఖమ్మం