ఖమ్మం, ఫిబ్రవరి 11: ప్రజలు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని భవిష్యత్తులో సుడా పరిధిలోని ప్రజా అవసరాలకు అనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్ రూపొందిస్తామని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ తెలిపారు. స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ఖమ్మం) సిద్ధం చేసిన సుడా డ్రాఫ్ట్ మాస్టర్ ప్లాన్‌పై శుక్రవారం భక్తరామదాసు కళాక్షేత్రంలో నిర్వహించిన స్టేక్ హోల్టర్ల సమావేశంలో వారు మాట్లాడారు. తొలుత నగర ప్రజలు, సుడా పరిధిలోని ప్రజాప్రతినిధులు, జిల్లా, మండల స్థాయి అధికారులు పాల్గొని సుడా మాస్టర్ ప్లాన్‌పై తమ అభిప్రాయాలను వెల్లడించారు. అనంతరం కలెక్టర్ గౌతమ్ మాట్లాడుతూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా సుడా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను ప్రముఖ కన్సల్టెన్సీ స్టెమ్ ఆధ్వర్యంలో తయారు చేస్తున్నట్లు చెప్పారు. రాబోయే 30 ఏళ్ల వరకు ప్రజా అవసరాల ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకొని సిద్ధం చేసిన మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌పై ప్రజలు, ప్రజాప్రతినిధులతో విస్తృతంగా చర్చిస్తామన్నారు.
భవిష్యత్తులో పెరిగే జనసాంద్రత అవసరాలకు అనుగుణంగా తాగునీటి సరఫరా, విద్యుత్, పారిశుధ్యం, రోడ్ల విస్తరణ, రెసిడెన్షియల్, కమర్షియల్, బఫర్ జోన్లు, విద్య, వైద్యం, ట్రాఫిక్ నియంత్రణ, నీటి వనరులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను సిద్ధం చేశామని వివరించారు. దీనిపై స్టేక్ హోల్డర్లు తమ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను అందించాలని కోరారు. సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మాట్లాడుతూ అందరి అభిప్రాయాల మేరకు సుడా మాస్టర్ ప్లాన్ ప్రతిపాదనలను హైదరాబాద్ డీటీసీపీకి సమర్పించనున్నట్లు చెప్పారు. మేయర్ నీరజ మాట్లాడుతూ అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటామన్నారు. కేఎంసీ కమిషనర్, సుడా వైస్ చైర్మన్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రజల అవసరాలు, కనీస వసతుల కల్పన కోసం ప్లాన్‌లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసేందుకు ప్రజల అభిప్రాయాలు సేకరిస్తామన్నారు. స్టెమ్ కన్సల్టెన్సీ ప్రతినిధి శ్రీకుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్‌ను వివరించారు. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డిప్యూటీ మేయర్ ఫాతిమా, డీటీసీపీ జేడీ రమేశ్‌బాబు, అదనపు కలెక్టర్ ఎన్.మధుసూదన్, జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో వీవీ అప్పారావు, టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, సుడా డైరెక్టర్లు కొల్లు పద్మ, పులిపాటి ప్రసాద్, సుడా పరిధిలోని ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.