Pakistan : నిత్యం మతసామరస్యం, మైనారిటీల సంక్షేమం గురించి ఇండియాకు నీతులు చెప్పే పాకిస్తాన్.. ఆ దేశంలో మాత్రం అది పాటించడం లేదు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంటుంది. ఈ విషయం ఇప్పుడు మరోసారి రుజువైంది. పాకిస్తాన్లో ఉన్న 200 ఏళ్లనాటి చారిత్రక గురుద్వారాను అక్కడి ప్రభుత్వం కూల్చివేసింది. దీనిపై అక్కడి సిక్కు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
పాకిస్తాన్లోని క్వెట్టా పట్టణంలో 200 ఏళ్లనాటి చారిత్రక గురుద్వారా ఉంది. దీని పేరు గురుద్వారా శ్రీ గురు సింగ్ సభ. ఒకప్పుడు ఈ ప్రాంతంలో సిక్కులు ఎక్కువగా ఉండేవారు. వాళ్లంతా ఇక్కడే చేరి ప్రార్థనలు చేసేవాళ్లు. సిక్కుల ఆధ్యాత్మిక సంస్కృతికి, చారిత్రక నేపథ్యానికి ఇది వారసత్వ సంపదగా నిలిచింది. అలాంటి, పవిత్ర గురుద్వారాను తాజాగా అక్కడి ప్రభుత్వం బుల్డోజర్లతో కూల్చేసింది. అది కూడా ఒక షాపింగ్ మాల్ నిర్మాణం కోసం ఈ గురుద్వారాను కూల్చేశారు. అయితే, ఈ గురుద్వారాను ఒక ప్రైవేటు బిల్డింగ్కు అమ్మేశారని అక్కడి ఒక సిక్కు నేత చెప్పాడు.
కానీ, ఈ విషయంలో అధికారికంగా ఎలాంటి స్పష్టత లేదు. అయితే, ఇలా గురుద్వారా కూల్చేయడంపై అక్కడి సిక్కులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే మొదటి ఘటన కాదంటున్నారు. ఇది ఒక బిల్డింగును కూల్చడం కాదని, తమ మతపరమైన సంప్రదాయాలు, జ్ఞాపకాల్ని చెరిపేయడమే అని వారు విమర్శిస్తున్నారు. ఈ కూల్చివేతను నిరసిస్తూ అక్కడి సిక్కులు బలూచిస్తాన్ హైకోర్టును ఆశ్రయించారు. కానీ, ఈ కూల్చివేతను అడ్డుకునేందుకు కోర్టు నిరాకరించింది. గతంలో ఈ ప్రాంతంలో 12 చారిత్రక గురుద్వారాలు ఉండేవి. ఇప్పుడు రెండు మాత్రమే ఉన్నాయి.