ఖమ్మం, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘రక్తదానం ప్రాణదానం..’, ‘రక్తదానం మహాదానం..’ ఒకరు ఇచ్చే రక్తం మరొకరి ప్రాణాన్ని నిలబెడుతుంది.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా రోగుల ప్రాణాలను కాపాడేందుకు యువత, అధికారులు, ప్రజాప్రతినిధులు రక్తదానం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఈ మేరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అధికారులు రక్తదాన శిబిరాలు నిర్వహించారు.. ఖమ్మంలోని ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్, రూరల్ మండల శిబిరాన్ని ఎమ్మెల్సీ తాతా మధు, మధిర శిబిరాన్ని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, వైరా శిబిరాన్ని ఎమ్మెల్యే రాములునాయక్ ప్రారంభించారు. భద్రాద్రి జిల్లా మణుగూరులో ఏర్పాటు చేసిన శిబిరాన్ని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పాల్వంచలో డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు రక్తదాన శిబిరాలను ప్రారంభించారు. రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు.
స్వతంత్రభారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా రక్తదదాన శిబిరాలు జరిగాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు భద్రాద్రి జిల్లావ్యాప్తంగా 412 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. యువకులు, పోలీసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు రక్తదానం చేశారు. మణుగూరులో ప్రభుత్వ విప్ రేగా కాంతారావు, కలెక్టర్ అనుదీప్ పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానమన్నారు. చావుబతుకుల్లో ఉన్న వారికి రక్తం తిరిగి ప్రాణం పోస్తుందన్నారు. ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియ, భద్రాచలంలో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, పాల్వంచలో డీసీహెచ్ఎస్ డాక్టర్ ముక్కంటేశ్వరరావు రక్తదానం చేసిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అధికారులు భద్రాచలం నియోజకవర్గం నుంచి 87 యూనిట్లు, మణుగూరులో 92, ఇల్లందులో 80, పాల్వంచలో 80, అశ్వారావుపేటలో 73 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమాల్లో డీఎంహెచ్‌వో దయానందస్వామి, జిల్లా ప్రోగ్రాం అధికారులు పాల్గొన్నారు.
మధిరలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు ప్రారంభించారు. వైద్యారోగ్య సిబ్బంది, పంచాయతీరాజ్ ఉద్యోగులు, పంచాయతీ సెక్రటరీలు, పోలీసులు రక్తదానం చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని రాంలీల కల్యాణ మండపంలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ప్రారంభించారు. జడ్పీటీసీ వరప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ ఇంటూరి శేఖర్ పాల్గొనారు. పెనుబల్లి పీహెచ్సీలో జరిగిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రారంభించారు. వైద్యారోగ్య సిబ్బంది, యువకులు రక్తదానం చేశారు. వైరా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎమ్మెల్యే రాములునాయక్ ప్రారంభించారు. మున్సిపల్ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది రక్తదానం చేశారు. ఖమ్మం ప్రధాన ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన శిబిరాన్ని కలెక్టర్ వీపీ గౌతమ్ ప్రారంభించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ మాలతి, ఆసుపత్రి మెడికల్ సూ పరింటెండెంట్ వెంకటేశ్వర్లు, ఆర్ఎంవో శ్రీనివాసరావు పాల్గొన్నారు.