ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్ట్ 17: ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రక్రియ షురూ అయింది. జూలైలో జరిగిన ఇంటర్మీడియట్ ప్రథమ (సప్లిమెంటరీ/ ఇంప్రూవ్మెంట్), ద్వితీయ సంవత్సరం సప్లిమెంటరీ విద్యార్థుల సమాధాన పత్రాలను జంబ్లింగ్ పద్ధతిలో నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ క్యాంపు జరుగుతున్నది. తొలుత ఈ నెల 13న స్పాట్ ప్రారంభం కాగా లాంగ్వేజెస్‌తో పాటు గణితం, ఎకనామిక్స్ మూల్యాంకనం ప్రారంభమైంది. లాంగ్వేజెస్‌తో పాటు నాన్ లాంగ్వేజెస్ సబ్జెక్ట్‌ల్లో ఇతర జిల్లాల కంటే జిల్లాలోనే మూల్యాంకన ప్రక్రియ వేగంగా జరుగుతున్నది. ఈ నెల 22 తేదీలోపు స్పాట్ ముగుస్తుందని అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లు వెల్లడించారు.
శరవేగంగా ప్రక్రియ..
ఇప్పటివరకు 40శాతం మూల్యాంకనం పూర్తయింది. ఆయా సబ్జెక్టుల చీఫ్ ఎగ్జామినర్లు, అసిస్టెంట్ ఎగ్జామినర్లు అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లకు రిపోర్ట్ చేశారు. పరీక్షలు జరుగుతుండగానే కంట్రోల్ రూంకి సమాధాన పత్రాలు చేరుకున్నాయి. స్పాట్‌కు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు మాత్రమే పాల్గొంటున్నారు. ప్రైవేట్ కళాశాలల్లో పనిచేసే అధ్యాపకులు హాజరుకావడం లేదు. అధికారులు ప్రభుత్వ విద్యాసంస్థలతో పాటు ఇతర యాజమాన్యాలకు చెందిన అధ్యాపకులూ స్పాట్లో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారు. వాల్యుయేషన్‌ను వేగవంతంగా నిర్వహిస్తున్నారు.
72,972 సమాధాన పత్రాలు..
ఉన్నతాధికారులు సప్లిమెంటరీ శిబిరాలకు 72,972 సమాధాన పత్రాలు కేటాయించారు. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో అన్ని సబ్జెక్ట్‌ల ఆన్సర్ షీట్లు అందించారు. వాల్యుయేషన్ ప్రక్రియలో రెండు జిల్లాలకు (ఖమ్మం, భద్రాద్రి) చెందిన అధ్యాపకులు పాల్గొంటున్నారు. తెలుగు 3,472 ప్రశ్నాపత్రాలు, సంస్కృతానికి-4017, ఇంగ్లిష్‌లో-13,245, గణితం ఏలో-4458, గణితం-బి 6,758, బోటనీ- 1,893, జువాలజీ- 3,291, సివిక్స్-7,091, హిస్టరీ-324, భౌతికశాస్త్రం- 4,165, కెమిస్ట్రీ- 6,022, కామర్స్-6,274, ఎకానమిక్స్-7,802 పత్రాలను అధ్యాపకులు మూల్యాంకనం చేస్తున్నారు. కంట్రోల్ అధికారులు, కోడింగ్ అధికారులు ఎప్పటికప్పుడు వాల్యుయేషన్ స్టేటస్‌ను ఉన్నాతాధికారులకు నివేదిస్తుస్తున్నారు.
1,309 మంది భాగస్వామ్యం..
పరీక్షల మూల్యాంకనంలో అన్ని హోదాలు కలిపి 1,309 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. క్యాంప్ ఆఫీసర్‌గా జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి రవిబాబు, అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్ జనరల్-1గా నయాబజార్ కళాశాల ప్రిన్సిపాల్ రామారావు వ్యవహరిస్తున్నారు. వీరితో పాటు 373 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు, 73 మంది చీప్ ఎగ్జామినర్లు, 69 మంది స్క్రూటినైజర్లు, 13 మంది సబ్జెక్ట్ నిపుణులు విధులు నిర్వర్తిస్తున్నారు కామర్స్, హిస్టరీ సబ్జెక్ట్‌ల వాల్యుయేషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. గురువారం ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ నెల 22లోపు ప్రక్రియ పూర్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్పాట్ నిర్వహిస్తున్నారు.