ఖమ్మం, ఆగస్టు 17: హరితహారం కార్యక్రమాన్ని ఈ నెల 21న పెద్ద ఎత్తున పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా హరితహారం నిర్వహణపై అటవీశాఖ స్పెషల్ సెక్రటరీ శాంతకుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి మాట్లాడారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఈ నెల 21న నిర్వహించే ప్రత్యేక సమావేశాలను పెద్ద ఎత్తున వివాహాలు ఉన్న నేపథ్యంలో ఇటీవల క్యాబినెట్ రద్దు చేసిందని, అదే రోజు రాష్ట్ర వ్యాప్తంగా హరితహారం కింద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. 8వ విడత హరితహారం కింద జిల్లాలకు కేటాయించిన లక్ష్యాలను పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా 240 కోట్లకు పైగా మొక్కలు నాటామన్నారు.
ప్రజాప్రతినిధులు, అధికారుల సమన్వయం, ప్రజల భాగస్వామ్యం ఫలితంగా రాష్ట్రంలో పచ్చదనం శాతం 7.7కు పెరిగిందని మంత్రి గుర్తుచేశారు. 21న ప్రతి పంచాయతీ, మున్సిపల్ వార్డుల్లో మొక్కలు నాటాలని, అవసరమైన మేర మొక్కలను అందుబాటులో ఉంచుకోవాలని, మొక్కల సంరక్షణ కోసం ఉపాధి హామీ పథకం కింద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రస్తుత సంవత్సరంలో రాష్ట్ర వ్యాప్తంగా 19.84 కోట్ల మొక్కలు నాటేలా లక్ష్యం నిర్దేశించుకున్నామని, ఇప్పటి వరకు మూడొంతుల పనులు పూర్తి చేశామని అటవీ శాఖ స్పెషల్ సెక్రటరీ శాంతకుమారి తెలిపారు. ఈ నెల 21న జిల్లాలో పెద్ద ఎత్తున మొక్కలు నాటి లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో 8వ విడత హరితహారం కింద 50 లక్షల మొక్కలు నాటడం లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 42 లక్షల మొక్కలు నాటామని తెలిపారు. ఈ నెల 21న మిగులు మొక్కల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. 21న ఉదయం 6 గంటలకే మొక్కలు నాటడాన్ని ప్రారంభిస్తామన్నారు. అదనపు కలెక్టర్ స్నేహలత, కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్డీవో విద్యాచందన, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, డీపీవో హరిప్రసాద్, ప్రకాశ్‌రావు, సతీశ్ తదితరులు పాల్గొన్నారు.