ఖమ్మం, జూన్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): పెద్దల సభకు ఎన్నికయ్యేలా ఖమ్మం జిల్లాకు చెందిన వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి), బండి పార్థసారథిరెడ్డిలకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతగా ‘సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞత’ సభను శనివారం ఖమ్మంలోని పటేల్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికయ్యాక వారు తొలిసారిగా జిల్లాకు వస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఖమ్మంలో సభను నిర్వహిస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నాయకత్వంపై సీఎం కేసీఆర్ పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా సభ నిర్వహించాలని ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు, ప్రధాన నాయకులు నిర్ణయించారు. ఇందుకోసం కనీవినీ ఎరుగని రీతిలో భారీ సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు మంత్రి అజయ్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తాతా మధు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరిగాయి.
భారీ జన సమీకరణకు సన్నాహాలు..
ఖమ్మం జిల్లాకు రెండు రాజ్యసభ స్థానాలను కేటాయించడంతో జిల్లా నుంచి పార్లమెంట్లో ప్రాతినిథ్యం వహించే వారి సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్లమెంటరీ పక్ష నేతగా ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు వ్యవహరిస్తున్నారు. ఆయనకు ఇప్పుడు జిల్లా నుంచి గాయత్రి రవి, బండి పార్థసారథిరెడ్డి తోడయ్యారు. జాతీయ రాజకీయాల్లో సీఎం కేసీఆర్ కీలక పాత్ర పోషించనున్న ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాకు చెందిన ముగ్గురు ఎంపీల పాత్ర కీలకం కానుంది. ఈ నేపథ్యంలో ఖమ్మంలో నిర్వహిస్తున్న కృతజ్ఞత, అభినందన సభకు ప్రాధాన్యం సంతరించుకున్నది. నియోజకవర్గాల నుంచి జనసమీకరణ చేయాల్సిన బాధ్యతలను ఆయా ఎమ్మెల్యేలకు అప్పగించారు.
భారీ ర్యాలీలు..
వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డిలకు టీఆర్ఎస్ ఉమ్మడి జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఘనంగా స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో ఖమ్మం వస్తున్న వీరికి జిల్లా సరిహద్దు గ్రామమైన నాయకన్‌గూడెం వద్ద ఘన స్వాగతం పలకనున్నారు. అక్కడి నుంచి భారీ సంఖ్యలో కార్లు, బైకుల ర్యాలీ నడుమ వారిని ఖమ్మం తీసుకరానున్నారు. మధ్యాహ్నం 2:45 గంటలకు నాయకన్‌గూడెం నుంచి ర్యాలీగా బయలుదేరుతారు. 3:15 గంటలకు ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లికి చేరుకుంటారు. అక్కడ నుంచి బైక్ ర్యాలీగా కాల్వొడ్డు, వైరా రోడ్డు మీదుగా సాయంత్రం 4 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియానికి చేరుకుంటారు. సభ ఏర్పాట్లను శుక్రవారం రాత్రి టీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు పరిశీలించారు. ఆయనతోపాటు నల్లమల వెంకేటేశ్వరరావు, కనకమేడల సత్యనారాయణ, చింతనిప్పు కృష్ణచైతన్య, చిత్తారు సింహాద్రియాదవ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్ తదితరులు ఉన్నారు.