ఖమ్మం/ రఘునాథపాలెం/ ఖమ్మం కల్చరల్, జూన్ 2: కొత్త రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికి దిక్సూచిగా నిలిచిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ తల్లి సర్కిల్ వద్ద గల తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అక్కడ నుంచి పెవిలియన్ గ్రౌండ్ వద్దకు చేరుకొని అక్కడ ఉన్న అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
దళితబంధు యూనిట్ల పంపిణీ..
నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పాల్గొని అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించారు. ఆ తరువాత వీణా నృత్యాలయం పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి బహుమతులను అందజేశారు. అనంతరం దళితబంధు లబ్ధిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు.
ఎగసిన సాహితీ కెరటం..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే తెలంగాణలో సాహితీ సంపద పెరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాహితీ సభలు, తెలుగు ఉత్సవాలు నిర్వహించారని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని భక్త రామదాసు కళాక్షేత్రంలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 70 మంది కవులను సత్కరించారు.
క్రీడలకు పూర్వ వైభవం
గ్రామీణ క్రీడలకు పూర్వ వైభవం తీసుకరావాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఊరూరా క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధి 6వ డివిజన్ రస్తోగినగర్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని గురువారం మంత్రి ప్రారంభించి మాట్లాడారు. ఈ సందర్భంగా వాలీబాల్ చేతపట్టి కాసేపు సరాదాగా ఆడారు.