ఖమ్మం ఎడ్యుకేషన్, జూన్1: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఖమ్మంలో ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు పుస్తక ప్రదర్శన నిర్వహించనున్నట్లు తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తెలిపారు. వారం రోజుల పాటు జరగనున్న పుస్తక ప్రదర్శన వివరాలను ‘నమస్తే తెలంగాణ’కు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం భారీగా ఉద్యోగ ప్రకటనలు విడుదల చేసింది. ఈ నేపథ్యంలో యువతరానికి పుస్తక ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారికి కావాల్సిన పుస్తకాలు, సమాచారం బుక్ ఫెయిర్లో లభిస్తుంది. పోటీ పరీక్షలతోపాటు భక్తి, ముక్తి, రక్తి, అనురక్తి, వ్యక్తిత్వ ఎదుగుదలకు సంబంధించిన సాహిత్యం అందుబాటులో ఉంది.
వారం రోజులపాటు కార్యక్రమాలు : వారం రోజులపాటు సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు బుక్ ఫెయిర్లో ఉంటాయి. ప్రతిరోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు జరిగే ప్రదర్శనలో సాహి త్యం, సాంస్కృతికంలో రోజుకో అంశం ఉంటుంది. ఒక్కోవిభాగానికి బాధ్యులు ఉన్నారు. పాఠశాలస్థాయి నుంచి కళాశాలలు, విశ్వవిద్యాలయ స్థాయి విద్యార్థులు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు పాల్గొనేలా అందరూ భాగస్వామ్యం వహిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికి మూడుసార్లు పుస్తక ప్రదర్శనలు నిర్వహించాం. ఉమ్మడి జిల్లాలో మారుమూల గ్రామం రోట్టెమాకురేవు గ్రామంలో గ్రామస్థాయి పుస్తక ప్రదర్శన నిర్వహించాం. ఈ ప్రదర్శనను పాలన యంత్రాంగం, మున్సిపల్ శాఖ, రాష్ట్ర సాహిత్య అకాడమీసంయుక్తంగా నిర్వహిస్తున్నాయి.