ఖమ్మం మే 31 (నమస్తే తెలంగాణ ప్రతినిధి);త్యాగాలు.. ఆత్మ బలిదానాలు.. మరెన్నో అవమానాలను చవిచూసిన తెలంగాణ మురిసిన రోజును ఎప్పటికీ మరువలేం.. నమ్మక ద్రోహులు, ఉమ్మడి పాలకుల చేతుల్లో ఏళ్ల పాటు నడిచిన అనుభవం కళ్లముందే కదలాడుతున్నది.. నిధులు, నియామకాలు, నీళ్ల కేటాయింపులో జరిగిన అన్యాయాన్ని మాటల్లో చెప్పలేం. అన్నింటినీ పటాపంచలు చేసి స్వరాష్ట్రం సాధించి ఎనిమిదేండ్లు పూర్తయింది. నేడు తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతుకుతున్నారు. నాడు జిల్లేళ్లు మొలిచిన భూముల్లో నేడు బంగారం పండుతున్నది. ఉపాధి, ఉద్యోగాలు లేక పొట్ట చేతపట్టుకుని బతుకుదెరువుకు పట్టణాలకు వలసెళ్లిన ప్రజలు గ్రామాలకు తిరిగొస్తున్నారు. పంటలకు జలధారలు తరలొస్తున్నాయి. రైతన్న గుండె మీద చేయి వేసుకొని నాగలి ఎత్తాడు. ఇదే తరహాలో ఖమ్మం జిల్లాలో అభివృద్ధి పరవళ్లు తొక్కింది.. జిల్లా రాతను తిరగరాసింది. ఆ ప్రగతి ప్రస్థానంపై రేపు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ‘నమస్తే’ ప్రత్యేక కథనం.
పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రంలో ప్రగతి పరవళ్లు తొక్కుతున్నది. ప్రజల ఆకాంక్షలకు అభివృద్ధి తిలకం దిద్దుతున్నది. సకల జనుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు అర్హుల దరి చేరుతున్నాయి. నాడు జిల్లేడు మొలిచిన భూములు పచ్చని పైర్లతో కళకళలాడుతున్నాయి. ఉపాధి లేక వలసవెళ్లి వారంతా తిరిగి స్వగ్రామానికి చేరుకుంటున్నారు.
నాడు దండుగన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేసి చూపించారు. రైతుబంధు, రైతు బీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్లు, ఆసరా ఇలా ఎన్నో పథకాలతో ప్రజల హృదయాల్లో తెలంగాణ ప్రభుత్వం చెరగని ముద్ర వేసుకున్నది. ఎనిమిదేండ్ల పాలనలో ఖమ్మం జిల్లా మురిసి.. మెరిసిపోతున్నది. నేటితో కేసీఆర్ పాలనకు ఎనిమిదేండ్లు పూర్తి అవుతున్నది. ఈనేపథ్యంలో ఖమ్మం జిల్లాలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
జిల్లావ్యాప్తంగా తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు పాలేరు, వైరాను రెండు సెగ్మెంట్లుగా విభజించారు. జిల్లాకు 519 వాటర్ ట్యాం కులు మంజూరయ్యాయి. జిల్లావ్యాప్తంగా 4.75 లక్షల ఇండ్లకు నల్లాద్వా రా మంచినీరు అందుతున్నది. పాలే రు రిజర్వాయర్ నుంచి ఆరు మండలాలతో పాటు ఖమ్మం నగర కార్పొరేషన్, వైరా రిజర్వాయర్ నుంచి 11 మండలాలతో పాటు ఒక మున్సిపాలిటీ, గోదావరి నుంచి మూడు మండలాల పరిధిలోని ఒక మున్సిపాలిటీకి నీరు సరఫరా అవుతున్నది.
సీతారామ ప్రాజెక్టుతో సస్యశ్యామలం…
భద్రాద్రి జిల్లాలో నిర్మిస్తున్న సీతారామ ప్రాజెక్టు పూర్తయితే ఖమ్మం జిల్లాలోని 1.33 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందనున్నది. సత్తుపల్లిలో ప్రధాన కాలువ సత్తుపల్లి ట్రంక్ పనులు పురోగతిలో ఉన్నాయి. పాలేరు లింక్ కాలువ ద్వారా 47,381 ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీటి వసతి అందనున్నది. పాలేరు రిజర్వాయర్ దిగువనున్న నాగార్జున సాగర్ ఎడమ కాలువ, వైరా ప్రాజెక్టు, లంకాసాగర్ ప్రాజెక్టులకు నీరు అందుతున్నది. ఈ కాలువ నాలుగు ప్యాకేజీలుగా ఉన్నది.
ప్రస్తుతం కాలువలకు భూసేకరణ జరుగుతున్నది. ప్యాకేజీ- 15లో కాలువ తవ్వకాలు, ఆకేరు, మున్నేరు, ఆక్విడెక్ట్ పనులు జరుగుతున్నాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువలకు అంచనాలు సిద్ధమవుతున్నాయి. త్వరలో టెండర్ల ప్రక్రియ జరుగనున్నది. జిల్లావ్యాప్తంగా 1,504 చెరువులకు మిషన్ కాకతీయ ద్వారా రూ.18,015 కోట్లు ఖర్చు చేసి స్థిరీకరణ పనులు చేపట్టగా 74,332 ఎకరాలకు స్థిరీకరణ జరిగింది.
మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం..
వేసవి కాలం వచ్చిందంటే ఖమ్మానికి నీటి గండమే. 40 ఏండ్లుగా మున్సిపల్ పీఠంపై కూర్చున్న సీపీఎం పాలకపక్షం నగర ప్రజల గొంతును వారానికి మూడు రోజులు కూడా తడపలేక పోయిం దన్నది జగమెరిగిన సత్యం. కానీ రాష్ట్రంలో టీఆర్ఎస్ సర్కార్ వచ్చిన తర్వాత ఖమ్మం మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నది. కేఎంసీ అమృత్ పథకాన్ని మిషన్ భగీరథ పథకానికి అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.230 కోట్లతో మెగా మంచినీటి ప్రాజెక్ట్ను నగర ప్రజల ముందు ఆవిష్కరించారు.
పాలేరు నుంచి వస్తున్న శుద్ధిచేసిన కృష్ణా జలాలు అతికొద్ది కాలంలోనే ఖమ్మంలో పరవళ్లు తొక్కుతున్నాయి. నగర పౌరుల్లో ఒక్కొక్కరికీ రోజుకు 150 లీటర్ల చొప్పున నీరు సరఫరా అవుతున్నది. వచ్చే 30 ఏండ్ల పాటు సరఫరా చేసేవిధంగా పక్కా ప్రణాళికలు ఉన్నాయి. దీనికంటే ముందు ఉమ్మడి పాలనలో మంజూరు చేసిన రూ.74 కోట్ల విలువైన మంచినీటి ప్రాజెక్ట్ సైతం తెలంగాణ వచ్చిన తర్వాతే పూర్తి కావడం గమనార్హం.
గ్రామ పంచాయతీలకు రూ.130 కోట్లు విడుదల…
తెలంగాణ ప్రభుత్వం విడతలుగా అమలు చేస్తున్న పల్లె ప్రగతితో గ్రామాలు ప్రగతి బాటలో పయనిస్తున్నాయి. 2019 సెస్టెంబర్ నుంచి పథకం అమలవుతున్నది. జూన్లో తిరిగి అమలుకానున్నది. పథకం ద్వారా జిల్లాలోని 589 గ్రామ పంచాయతీలకు 595 ట్రాక్టర్లు, 595 ట్రాలీలు, 589 ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి. 2021-22లో గ్రామాభివృద్ధికి రూ.130 కోట్ల నిధులు విడుదలయ్యాయి. ఇంటి పన్నుల ద్వారా రూ.19.51 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రతి గ్రామంలో అన్ని వసతులతో వైకుంఠధామాలు, వేలాది మొక్కలతో పల్లె ప్రకృతి వనాలు, ఎరువుల తయారీకి అనుకూలంగా డంపింగ్ యార్డులు అందుబాటులోకి వచ్చాయి. గ్రామాల్లో పాడుబడిన బావుల పూడ్చివేత, శిథిల భవనాల కూల్చివేత పూర్తయింది.
తెలంగాణకే ఆదర్శం ఖమ్మం అభివృద్ధి..
మౌలిక వసతుల కల్పనలో భాగంగా నగరంలో సర్కార్ కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టింది. రూ.4 కోట్లతో లకారం చెరువు సుందరీకరణ, రూ.100 కోట్లతో గోళ్లపాడు చానల్ పనులు, రూ.24 కోట్లతో నూతన మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం, రూ. 229 కోట్లతో మిషన్ భగీరథ అమృత్ పథకం పూర్తయింది. నగరంలో 75 వేల గృహాలకు శుద్ధజలం సరఫరా అవుతున్నది. నగరంలో 17,043 ఎల్ఈడీ వీధి దీపాలు ఏర్పాటయ్యాయి. రూ.73.50 లక్షలతో జిల్లా ప్రధాన గ్రంథాలయం, గాంధీ పార్కు గ్రంథాలయాల ఆధునీకరణ జరిగింది. రూ.28 కోట్లతో రెండు స్టేజ్ల్లో ఐటీ హబ్ పూర్తయింది. 2 వేల మందికి డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు జరిగింది.
అభివృద్ధికి భారీగా నిధులు..
సుమారు రూ.వెయ్యి కోట్ల పైచిలుకు నిధులతో ఖమ్మం నగరాభివృద్ధి జరిగింది. నగరపాలక సంస్థకు సర్కార్ ఏటా రూ.100 కోట్లు కేటాయించగా నగరపాలకసంస్థ ఆ నిధులతో నగరంలో అంతర్గత రహదారులు, నిరంతర మంచినీటి వసతి, నల్లా కనెక్షన్లు, వాడవాడలా సీసీ రోడ్లు, సైడు కాలువలు, జనాభా ప్రాతిపదికన కూరగాయల మార్కెట్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. నగర ప్రజల అవసరాలకు తగిన విధంగా కార్పొరేషన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది.