భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ) /అశ్వారావుపేట / సుజాతనగర్: వానకాలం సాగుకు అన్నదాతలు శ్రీకారం చుట్టారు. సాగుకు ముందు కర్షకులు భూసార పరీక్షలు చేసుకుంటే అధిక దిగుబడులు సాధించే అవకాశం ఉంది. ఈ పరీక్షల ద్వారా భూమి స్వభావం, మృత్తిక ఏ రకానికి చెందినదో, దానిలో ఉన్న పోషక పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. వాటిని బట్టి రైతులు పంటలు సాగు చేస్తే వృథా ఖర్చుల నుంచి విముక్తి పొందవచ్చు. భూసార ఫలితాల్లో ఏ భూమి తేలిక నేల, బరువు నేల తదితర విషయాలు తెలుస్తాయి. వ్యవసాయ భూముల్లో సహజంగా ఉండే పోషక పదార్థాల తోపాటు అదనంగా సేంద్రియ ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి సాధించ వచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు.
వానకాలం సీజన్ సమీపిస్తున్నది. పంటలు సాగు చేసే ముందు రైతులు భూసార పరీక్షలు చేయించుకుంటే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. పరీక్షా ఫలితాల ఆధారంగా సాగు చేస్తే వృథా ఖర్చులను తప్పించుకోవచ్చు. వ్యవసాయ భూముల్లో సహజంగా ఉండే పోషక పదార్థాలతో పాటు అదనంగా సేంద్రియ ఎరువులు అందేలా చర్యలు తీసుకుంటే అధిక దిగుబడి పొందవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. భూసారాన్ని కాపాడుకోవడానికి భూసార పరీక్షలు ఎంతో ఉపయోగకరిస్తాయి. సుస్థిర దిగుబడి పొందడానికి రైతులు రెండేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించాలి. భూసారాన్ని బట్టే రైతులు పంటలు సాగు చేయాలి. పరీక్షల ద్వారానే ఏ పంటకు ఎంత ఎరువు వేయాలి. సాగులో ఏ పద్ధతులు అవలబించాలనే విషయం తెలుస్తుంది.
రైతులకు లాభాలు ఇవీ..
భూపరీక్షల ద్వారా భూమి స్వభావం తెలుస్తుంది. మృత్తిక ఏ రకానికి చెందిందో తెలుస్తుంది. దానిలో ఉన్న పోషక పదార్థాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుస్తుంది. వాటిని బట్టి రైతులు పంటలు సాగు చేస్తే వృథా ఖర్చులు ఉండవు. పరీక్షా ఫలితాల్లో ఏ భూమి తేలిక నేల, బరువు నేల, మధ్యస్థంగా ఉన్న నేల అనే విషయాలు తెలుస్తాయి. నేలకు అమ్లగుణం ఉంటే వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సున్నం వాడి స్థాయి తగ్గించవచ్చు.
నమూనాలను సేకరించే విధానం..
పొలాల్లో పంట లేని సమయంలో మాత్రమే భూసార పరీక్షలకు మట్టి సేకరించాలి. నేల పొడిగా ఉన్నప్పుడు పొలం ఆరి ఉన్నప్పుడు మాత్రమే తీసుకోవాలి. సరిగ్గా చెప్పాలంటే మార్చి నుంచి మే నెల మధ్య సేకరించాలి. పండ్ల తోటలు సాగు చేసే రైతులు చెట్లకు ఎరువు వేయక ముందే మట్టి నమూనాలు తీసుకోవాలి. మట్టి వెళ్లే లోతు వరకు, ఏక వార్షిక పంటలకు 15 నుంచి 30 సెంటీమీటర్లలోపు మట్టి నమూనాలను సేకరించాలి. పొలంలోని గట్ల వద్ద, పంట కాల్వల్లో సేకరించకూడదు. మొక్కలు, చెట్ల కింద, చెట్ల పక్కన ఉన్న మట్టిని సేకరించకూడదు. కంపోస్టు, పశువుల ఎరువుల కుప్పలు ఉంచిన చోట, బురదగా ఉన్న నేల నుంచి నమూనాలు పనికిరావు.
నమూనాలు తీసేటప్పుడు నేల పైభాగంలోని చెత్తాచెదారాన్ని తీసివేయాలి. తీసిన చోట తేమ ఎక్కువగా ఉంటే నమూనాను నీడలో ఆరబెట్టాలి. ఎండలో ఆరబెట్టకూడదు. మట్టిని ఒక చోట నుంచి కాకుండా 10 నుంచి 15 ప్రాంతాల్లో తీయాలి. ఎంపిక చేసిన పొలంలో జిగ్‌జాగ్ (ఎగుడు దిగుడు) పద్ధతిలో సేకరించాలి. మట్టి తీసేందుకు పొలంలో ఒక అంగుళం (2.5 సెంటీమీటర్లు) మందం పారతో పై నుంచి కిందికి గీయాలి. అలా తీసిన మట్టిని పట్టా, చిన్న బకెట్లో సేకరించాలి. ఒక చోట బండ మీద కానీ, శుభ్రమైన పేపర్‌పై ఉంచాలి. నమూనాను పాలిథిన్ సంచి, గుడ్డ సంచుల్లో నింపి ప్యాక్ చేసి సమీపంలో ఉన్న భూసార పరీక్షా కేంద్రాలకు పంపించాలి. మట్టి నమూనాతో పాటు రైతు పేరు, సర్వే నెంబర్, గ్రామం, మండలం, సదరు భూమిలో సాగు చేసిన పంటలు, ఇప్పుడు సాగు చేయబోయే పంటల వివరాలు, ఫోన్‌నెంబర్‌ను జత చేయాలి.
పచ్చిరొట్ట సాగుతో ఎన్నో ప్రయోజనాలు
రైతులు పచ్చిరొట్ట సాగుతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వ్యవసాయశాఖ అధికారులు వెల్లడిస్తున్నారు. వానకాలం సాగుకు సన్నద్ధమవుతున్న వేళ ప్రతి రైతు తన భూమి, నేల సారం గురించి అవగాహన తప్పకుండా తెలుసుకుని ఉండాలి. ప్రస్తుతం నేలలో సేంద్రియ కర్బన శాతం రోజురోజుకు తగ్గిపోతున్నది. ఈ కారణంగా పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. నేల తిరిగి సారాన్ని పొందాలంటే రైతులు కచ్చితంగా పచ్చిరొట్ట సాగు చేయాలి. ప్రభుత్వం 65 శాతం రాయితీపై విత్తనాలను పంపిణీ చేస్తున్నది. పచ్చిరొట్టను భూమిలో కలియదున్నితే నేల సారవంతమవుతుంది. నేలలో సేంద్రియ కర్బనశాతం అనుకూల, సూక్ష్మజీవుల సంఖ్య, నీటి నిల్వ ఉంచుకునే సామర్థ్యం పెరుగుతుంది.
పచ్చిరొట్ట వేర్లపైన ఉండే రైజోబియం బ్యాక్టీరియాతో నత్రజని స్థిరీకృతమవుతుంది. పచ్చిరొట్ట సాగు చేస్తే భూమి పొర స్థిరంగా ఉంటుంది. భద్రాద్రి జిల్లాలో 21 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఎనిమిది రైతు సేవా కేంద్రాల్లో రైతులకు సరిపడా విత్తనాలు ఉన్నాయి. మొదటి దఫాలో జీలుగు 5,177 క్వింటాళ్లు, జనుము 275 క్వింటాళ్లు, పిల్లిపెసర 1,200 క్వింటాళ్లు అందుబాటులో ఉన్నాయి. జీలుగు క్వింటాకు రూ.6,325 కాగా రైతులు సబ్సిడీ పోను రూ.2214, జనుము క్వింటాకు రూ.8,325 కాగా సబ్సిడీ పోను రూ.2914, పిల్లిపెసర క్వింటాకు రూ.8,850 కాగా సబ్సిడీ పోను రైతులు రూ.3,098 చెల్లించాల్సి ఉంది.
మట్టి పరీక్షలు చేయించుకోవాలి..
రైతులు వ్యవసాయ పనులు మొదలుపెట్టే ముందు మట్టి పరీక్షలు చేయించాలి. పరీక్షలకు ఇదే అనువైన సమయం. భూసార పరీక్ష ఫలితాల్లో మట్టిలో ఎంత మేరకు పోషకాలు ఉన్నాయో తెలుస్తుంది. తద్వారా సాగులో వృథా ఖర్చులను అధిగమించవచ్చు. టీడీఎఫ్, పీవీకే, కృషి విజ్ఞాన కేంద్రంలో ఉచితంగా మట్టి పరీక్షలు చేయించుకోవచ్చు.
– కరుణశ్రీ, కొత్తగూడెం, ఏడీఏ
నిపుణుల సూచనలు పాటించాలి..
రైతులు తప్పనిసరిగా రెండేళ్లకు ఒకసారి భూసార పరీక్షలు చేయించాలి. దీనివల్ల నేలకు అనుకూలమైన పంటలు సాగు చేసుకోవడానికి వీలు ఉంటుంది. నిపుణుల సూచనలు పాటిస్తే నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవచ్చు. మట్టి నమూనా సేకరణ సమయంలో రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
– వై.నవీన్, మండల వ్యవసాయాధికారి, అశ్వారావుపేట