భద్రాద్రి కొత్తగూడెం, మే 31 (నమస్తే తెలంగాణ): పొగాకు ఆరోగ్యానికి హానికరమని, ఒక సిగరేట్ కాలిస్తే 12 నిమిషాల ఆయుష్షు తగ్గుతుందని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని రైల్వేస్టేషన్ నుంచి కలెక్టరేట్ వరకు నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. దేశంలో పొగాకుకు బానిసలైన వారు 2,074 మిలియన్ల మంది, ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడేవారు తొమ్మిది లక్షలు, క్యాన్సర్‌తో బాధపడేవారు ఐదు లక్షలు మంది ఉన్నారన్నారు. పొగతాగడం వల్ల ఏటా 10 లక్షల మంది చనిపోతున్నారన్నారు.
ఇంటర్మీడియట్, డిగ్రీ విద్యార్థులకు పొగాకు స్వీకరిస్తే కలిగే నష్టాలపై అవగాహన కల్పించాలన్నారు. డీఎంహెచ్‌వో దయానందస్వామి మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ గుట్కా, సిగరెట్‌కు దూరంగా ఉండాలని అన్నారు. పబ్లిక్ ప్రదేశాల్లో ఎవరైనా పొగతాగితే జరిమానా విధించాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌వో సుకృత, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ చేతన్, పీవో డాక్టర్ శిరీష, డిప్యూటీ డెమో ఫైజ్ మొయినుద్దీన్, డీఐవో డాక్టర్ నాగేంద్రప్రసాద్, హెల్త్ ఎడ్యుకేటర్ విజయ్‌కుమార్, హెచ్‌ఈవో రాంప్రసాద్, భద్రు నాయక్, డీపీవో దుర్గ, రాంచందర్ పాల్గొన్నారు.