భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (నమస్తే తెలంగాణ): \భద్రాచలం: పట్టుదలతో చదివితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించింది. భద్రాచలం పట్టణానికి చెందిన పోరిక మౌనిక. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సోమవారం ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో 637 ర్యాంకు సాధించి సత్తా చాటింది. ఆమె తండ్రి హైదరాబాద్‌లోని రాంకుమార్ బీడీఎల్ (భారత్ డైనమిక్స్ లిమిటెడ్) కంపెనీ జనరల్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. తల్లి వాణి భద్రాచలంలో పెట్రోల్ బంక్ నిర్వహిస్తున్నారు. మౌనిక విద్య హైదరాబాద్‌లోనే సాగింది.
ప్రాథమిక విద్య నుంచి పదోతరగతి వరకు బీపీ డీఏవీ సెంట్రల్ స్కూల్, ఇంటర్మీడియట్ శ్రీచైతన్య జూనియర్ కళాశాల, బీఫార్మసీ బోజిరెడ్డి కళశాలలో చదివింది. అనంతరం రీసెర్చ్ కోసం జర్మనీకి వెళ్లింది. చిన్నప్పటి నుంచే ఐఏఎస్ కావడం ఆమె కల కావడంతో తిరిగి స్వస్థలానికి వచ్చింది. తల్లిదండ్రులు ఆమె ఆసక్తిని గమనించి సివిల్స్ చదివించారు. ఆమె ఐదుసార్లు సివిల్స్ రాసింది. రెండుసార్లు ఇంటర్వ్యూ వరకు వెళ్లి వెనుదిరిగింది. పట్టుదలతో చదివి ఆరోసారి సివిల్స్ సాధించింది. భద్రాద్రి జిల్లా ఖ్యాతిని ఇనుమడింపజేసింది. మౌనిక తెలంగాణ క్యాడర్ ఐపీఎస్‌కు ఎంపికైనట్లు తెలిసింది.