మామిళ్లగూడెం, మే 30: యువత ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లి తమ కలలను నిజం చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కొవిడ్ మహమ్మారి కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల సమగ్ర సంరక్షణకు అమలు చేస్తున్న పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీంను ఉద్దేశించి సోమవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. కరోనా కారణంగా 4,315 మంది చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మిగిలారన్నారు. వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌కు కేంద్ర మంత్రి ప్రతిమా భౌమిక్, కలెక్టర్ వీపీ గౌతమ్ హాజరయ్యారు. అనంతరం పలువురు చిన్నారులకు పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీం పత్రాలు అందజేశారు. అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, ఎన్.మధుసూదన్, సీడబ్ల్యూసీ చైర్మన్ భారతీరాణి, జిల్లా సంక్షేమాధికారిణి సంధ్యారాణి, జిల్లా బాలల సంరక్షణ అధికారి విష్ణువందన పాల్గొన్నారు.
కొవిడ్ తో అనాథలైన పిల్లలను గుర్తించాం : భద్రాద్రి కలెక్టర్ అనుదీప్
భద్రాద్రి కొత్తగూడెం, మే 30 (నమస్తే తెలంగాణ): జిల్లాలో కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయిన నలుగురు బాలురు, ఒక బాలికను గుర్తించామని కలెక్టర్ అనుదీప్ తెలిపారు. వారి సంరక్షణకు సమగ్ర చర్యలు తీసుకుంటున్నామన్నారు. సోమవారం పీఎం మోదీ వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరైన ఆయన అనాథ పిల్లల వివరాలు వెల్లడించారు. పిల్లల వివరాలను ‘పీఎం కేర్స్’ పోర్టల్‌లో నమోదు చేశామన్నారు. వారికి రాష్ట్ర ప్రభుత్వం అందించిన రూ.50 వేలు అందజేస్తామన్నారు. సమావేశంలో డీడబ్ల్యూవో వరలక్ష్మి, డీసీపీవో హరికుమారి, సీడబ్ల్యూసీ సభ్యులు సాదిక్‌పాషా, అంబేడ్కర్, సుమిత్రాదేవి పాల్గొన్నారు.