ఖమ్మం ఏఎంసీలో క్వింటాల్‌కు రూ.12,001
దేశంలోనే తొలిసారి రికార్డు స్థాయి ధర
ఖమ్మం వ్యవసాయం, మార్చి 26 : పత్తి ధర మరోసారి సరికొత్త రికార్డు సృష్టించింది. మొన్నటి వరకు ఎర్ర బంగారం ధరలు రైతుల ఇంట సిరులు కురిపించగా.. నేడు తెల్లబంగారమూ అదే ఒరవడి కొనసాగిస్తున్నది. తద్వారా ఈ ఏడాది మిర్చి, పత్తి సాగు చేసిన రైతులకు మంచి ఆర్థిక ప్రయోజనం చేకూర్చాయి. కొద్ది రోజుల నుంచి తెలంగాణ వ్యవసాయ మార్కెట్లలో పత్తి పంటను కొనుగోలు చేసేందుకు ఖరీదుదారులు పోటీ పడుతున్నారు. పక్షంరోజుల వ్యవధిలోనే క్వింటాల్ రూ.2 వేలకు పైగా పెరిగింది. శనివారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రైతులు 500 బస్తాలను తీసుకొచ్చారు. అనంతరం జరిగిన ఈ బిడ్డింగ్‌లో గరిష్ఠ ధర క్వింటాల్‌కు రూ.12,001 పలికింది. మధ్య ధర రూ.10,500 కాగా, కనిష్ఠ ధర రూ.9 వేల చొప్పున వ్యాపారులు పంటను కొనుగోలు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆశ్వాపురం గ్రామానికి చెందిన గోకినపల్లి సైదులు తీసుకొచ్చిన పంటకు రికార్డు ధర పలికిందని అధికారులు తెలిపారు.
పత్తి క్వింటాల్‌కు రూ.12 వేలు పలకడం దేశంలోనే ఇదే తొలిసారి. సీసీఐకి సంబంధించిన బేళ్లు పూర్తిగా ఖాళీ కావడం, పంట ఉత్పత్తులకు డిమాండ్ ఉండడంతో ధరల పెరుగదలకు కారణమైందని వ్యాపారులు చెబుతున్నారు. ఒక్క బేల్ ఖరీదు గతంలో రూ.45-50 వేలు పలుకగా.., ప్రస్తుతం మార్కెట్లో రూ.90 వేలు పలుకుతున్నదని ఖరీదుదారులు పేర్కొంటున్నారు. కాటన్ సీడ్కూ కిలో ఒక్కింటికి రూ.1800 నుంచి 2వేలు పలుకగా, ప్రస్తుతం మార్కెట్లో కిలో ఒక్కంటికి గింజలు రూ.4,500 పలుకుతున్నదని అధికారులు తెలిపారు. పంటను నిల్వ చేసుకొని మార్కెట్‌కు తీసుకొస్తున్న రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాది పత్తికి భారీగా ధరలు పలికే అవకాశం ఉందని వారు పేర్కొంటున్నారు.