ఖమ్మం వ్యవసాయం, నవంబర్ 8:గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త రకం పురుగు (తామర పురుగు) మిర్చి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నది. ముందస్తుగా నష్ట నివారణ చర్యలు చేపడితే పంటను కాపాడుకోవచ్చని ఉద్యానశాఖ అధికారులు, శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మిర్చిపంట ఎక్కువ మొత్తంలో సాగు జరిగే జిల్లాల్లో ఖమ్మం జిల్లా ముందువరుసలో ఉంది. గతేడాదితో పోల్చుకుంటే ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా 1.10 లక్షల ఎకరాల్లో మిర్చి పంట సాగవుతున్నది. సాధారణంగా మిరపకు తెల్లదోమ, తామర పురుగు, ఎర్రనల్లి, శనగపచ్చ, లద్దెపురుగు ఆశించి నష్టం కలుగజేస్తుంటాయి. ఈ ఏడాది తామర పురుగు ఉధృతి చాలా తీవ్రంగా ఉన్నదని అధికారులు చెబుతున్నారు. పది రోజుల నుంచి అధికారులు, శాస్త్రవేత్తలు తోటలను సందర్శించి కొత్తరకం తామర పురుగు ఉధృతిని గుర్తించారు. ఈ పురుగు పూలపై ఆశించి రెక్కలు, కేసరాల నుంచి రసాన్ని పీల్చుతున్నాయి. దీంతో మిరప పూలు వాడిపోతున్నాయి. కాయ ఏర్పడడం లేదు. ఆకులు, కాయలపై కూడా ఆశించి నష్టం కలుగజేస్తున్నాయి. సాధారణ రకం తామర పురుగుకు, ఈ తామరపురుగుకు చాలా వ్యత్యాసం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
పురుగు ఆశించాక కన్పించే లక్షణాలు..
లేత పురుగులు ప్రధానంగా ఆకులు, పువ్వుల మీద ఎక్కువ సంఖ్యలో చేరి రసం పీల్చడం వల్ల ఆకులు మాడిపోయినట్లు కనిసిస్తాయి. తద్వారా పువ్వులు గోధుమరంగులోకి మారి రాలిపోతాయి. ఈ పురుగు కాయ దశలో ఆశించడం వల్ల కాయలు గడసబారి ఇటుక రంగులోకి మారుతాయి ఈ నేపథ్యంలో సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటిస్తే పంటకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉండదు.
పురుగు జీవితచక్రం 20 – 25 రోజులే..
తామర పురుగుల జీవితచక్రం 20 – 25 రోజులు మాత్రమే ఉంటుంది. వీటిని శాస్త్రీయంగా పరిశీలించేందుకు ఇప్పటికే అధికారులు బెంగళూరులోని ఎన్బీఏఐఆర్కు పురుగులను పంపించారు. తల్లి పురుగు 150 వరకు గుడ్లు పెడుతుంది. వాటి నుంచే పిల్లలు బయటకు వస్తున్నాయి. పిల్ల పురుగులు రసాన్ని పీల్చి నష్టం కలుగుజేస్తున్నాయి. పెద్ద పురుగులు ఒక మొక్క నుంచి వేరొక మొక్కకు వాపిస్తున్నాయి. తామర పురుగుల జీవిత చక్రంలో గుడ్డు దశ, పిల్ల దశ, తల్లి దశ ఉంటాయి. వీటి కోసస్థ దశ భూమిలోనే జరుగుతుంది. తామర పురుగులు ఆశించినప్పుడు ముడత పైకి ఉంటుంది. కాబట్టి దానిని పైముడత అంటారు. నల్లి ఆశిస్తే కింద ముడత అంటారు.
పంటను నష్టపరిచే విధానం..
సాధారణంగా మిరప పంటను ఆశించే తామర పురుగుకు భిన్నంగా ఈ పురుగు ఉంది. ముదురు నలుపు రంగులో ఉన్న తామర పురుగులు పూతను ఆశించి నష్టపరుస్తున్నాయి. ఈ పురుగును నల్లిగా భావించి అందుకు సంబంధించిన మందులు పిచికారీ చేస్తుండడంతో ప్రయోజనం ఉండడం లేదు. పైగా ఖర్చు మరింత పెరుగుతున్నది. ఈ మందుతో ఆ పురుగులో గుడ్లు పెట్టే సామర్థ్యం పెరిగినట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో సింథటిక్ ఫైరిత్రాయిడ్స్ మందులను, స్పైనోసాడ్, ఫ్రోఫీనోపాస్, ఇమిడాక్లోప్రిడ్ లాంటి మందులను ఎక్కువసార్లు పిచికారీ చేయవద్దని వారు సూచిస్తున్నారు.
రైతులకు ప్రత్యేక అవగాహన కల్పిస్తున్నాం..
తామర పురుగు నివారణ చర్యల గురించి రైతులకు ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తున్నాం. కొద్ది రోజుల నుంచి ఆయా నియోజకవర్గాల ఉద్యాన అధికారులు, వైరా కృషి విజ్ఞానకేంద్రం శాస్త్రవేత్తలు సంయుక్తంగా తోటలను సందర్శించి పురుగు ఉధృత్తిని గమనిస్తున్నారు. నివారణ జాగ్రత్తల గురించి పూర్తిస్థాయిలో వివరిస్తున్నారు. పురుగుల ఉధృతికి అనుగుణంగా శాస్త్రవేత్తల సూచనల ప్రకారం మాత్రమే రైతులు ఆయా మందులను పిచికారీ చేయాలి. నివారణకు సరైన మందులున్నాయి. ముందస్తుగా తీసుకునే చర్యలతోనే ఎక్కువ నష్టం వాటిల్లకుండా చూసుకోవచ్చు.
అనసూయ, జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి, ఖమ్మం
పిచికారీ చేయాల్సిన మందులు..
అందుబాటులో ఉన్న మందుల పిచికారీ ద్వారా పిల్ల పురుగులను నివారించవచ్చు. కానీ తల్లి పురుగులకు వాటిని తట్టుకునే సామర్థ్యం ఉంది. ఇందుకోసం వేపనూనె అజాడిరిక్షన్ పదివేల పీపీఎం రెండు మిల్లీ లీటర్లు, 0.5 గ్రాముల సర్ప్ లేదా ట్రైటాన్ 100 లీటర్కు గ్రాముల నీటిలో కలుపుకొని పిచికారీ చేయాలి. తద్వారా తల్లి పురుగు గుడ్డు పెట్టకుండా నివారించవచ్చు. జీవ శిలీంద్ర నాశినులైన బవేరియ 5 గ్రాములు, వర్టిసిలియమ్ 5 గ్రాములు, పంచగవ్వ 30 మి.లీ లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయడం ద్వారా పురుగు ఉధృత్తి తగ్గే అవకాశముంది. పురుగుమందులకు సంబంధించి రీజెంట్ 80 డబ్ల్యూజీ 40-50 గ్రాములు లేదా ఎసిటామిఫ్రైడ్ 40 50 గ్రాములు లేదా ఇమిడా క్లోఫ్రిడ్, రీజెంట్ 40 – 50 గ్రాముల చొప్పున కలిపి ఎకరానికి నాలుగు రోజుల వ్యవధిలో పిచికారీ చేయడం ద్వారా పురుగు ఉధృతిని అదుపులో ఉంచొచ్చు. పై ముడుత, కింది ముడుత ఉధృతి ఉంటే డైఫెన్ తయిరాన్ 1.5 గ్రాములు లేదా క్లోరోఫెన్ ఫైర్ రెండు మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేయాలి.