ఖమ్మం, మే 29 : అధికారంలోకి రావాలనే వ్యామోహంతో బీజేపీ నేతలు మతాల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు చేస్తున్నారని, బండి సంజయ్ తవ్వకాల వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని అఖిలపక్ష నేతలు అన్నారు. ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వై.విక్రం అధ్యక్షతన అఖిలపక్ష ప్రజాసంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సీపీఎం, సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా, న్యూడెమోక్రసీ, టీఆర్ఎస్, కాంగ్రెస్, సీపీఐ పార్టీలకు చెందిన నాయకులు ఈ సమావేశంలో మాట్లాడారు. కరీంనగర్లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వారు ఖండించారు.
హిందూ, ముస్లింల మధ్య ఐక్యతను విచ్ఛిన్నం చేసే వారికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ సమాజ ఐక్యతను దెబ్బతీసే విధంగా బండి వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. సీపీఐ ఎంఎల్ ప్రజాపంథా జిల్లా కార్యదర్శి గోకినపల్లి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ దేశ సమైక్యతను బీజేపీ ప్రభుత్వం ప్రమాదంలోకి నెడుతున్నదని ఆరోపించారు. టీఆర్ఎస్ నగర మాజీ అధ్యక్షుడు కమర్తపు మురళి మాట్లాడుతూ భారత రాజ్యంగాన్ని మార్చి ఆర్ఎస్ఎస్ రాజ్యాంగాన్ని అమలు చేయాలనే ఉద్దేశంతో చేస్తున్న బీజేపీ ప్రయత్నాలను తిప్పి కొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ నగర అధ్యక్షుడు ఎండీ జావిద్ మాట్లాడుతూ ఎన్నికలొచ్చిన ప్రతిసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసి, రాజకీయ పబ్బం గడుపుకోవడమే బీజేపీ పని అన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ అవాస్తవాలను ప్రచారం చేయడమే బీజేపీ, ఆర్ఎస్ఎస్ లక్ష్యమని అన్నారు. వివాదస్పద వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌పై కేసు నమోదు చేయాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, వీవీ రావు డిమాండ్ చేశారు. సమావేశంలో అఖిలపక్ష నాయకులు అప్రోజ్ సమీనా, భూక్యా వీరభద్రం, యర్రా శ్రీనివాస్, నవీన్‌రెడ్డి, ఆవుల వెంకటేశ్వర్లు, మిక్కిలినేని నరేంద్ర, ముస్తాఫా తాటి వెంకటేశ్వర్లు, ఐవీ రమణారావు, అసద్, గౌస్, అబ్బార్, రమేశ్, తిరుపతిరావు, డాక్టర్ సి.భారవి పాల్గొన్నారు.