ఖమ్మం ఎడ్యుకేషన్, మే 29: టెన్త్ పరీక్షా పత్రాల మూల్యాంకన (స్పాట్) ప్రక్రియకు నగరంలోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో తగిన ఏర్పాట్లు చేశారు. జూన్ 2 నుంచి ప్రారంభం కానున్న స్పాట్ విధుల కోసం ఏటా మాదిరిగానే ఈసారి ఉపాధ్యాయుల నుంచి తీవ్రస్థాయిలో పైరవీలు జరిగాయి. మూడేళ్ల బోధనా అనుభవం ఉన్న సీనియర్ ఉపాధ్యాయులనే ఈ విధుల్లో నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్చార్జి ఎంఈవోలుగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రధానోపాధ్యాయులకు అవకాశం కల్పించలేదు. అర్హుల జాబితాలోని ఉపాధ్యాయులు ఏ కారణంగానైనా మూల్యాంకనానికి హాజరుకాకపోతే ప్రత్యామ్నాయ భర్తీకి వీలుగా స్పాట్ ప్రారంభం రోజున సీనియర్ ఉపాధ్యాయులకు స్పాట్లోనే ఆర్డర్లు ఇచ్చేలా అందుబాటులో ఉంచనున్నట్లు డీఈవో యాదయ్య తెలిపారు. స్పాట్ నిర్వహించే ప్రాంగణంలో పూర్తి స్థాయిలో భద్రతా ఏర్పాట్లు చేశారు.
మూల్యాంకనం ప్రక్రియను జూన్ 2 నుంచి 12 వరకు నిర్వహించనున్నారు. పరీక్షా పత్రాలను స్ట్రాంగ్ రూమ్‌లో ఉంచారు. పరీక్షా పత్రాలకు ఈ నెల 25 నుంచి ‘డీకోడింగ్’ ప్రక్రియను ప్రారంభించారు. ఈ నెల 31న అసిస్టెంట్ క్యాంప్ ఆఫీసర్లతో సమావేశం నిర్వహించనున్నారు. ఏసీవోలుగా 8 మందిని నియమించారు. సమాధాన పత్రాలను ఎలా వాల్యూయేషన్ చేయాలి?, వాటిని ఎలా పర్యవేక్షించాలి? అనే అంశాలపై అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) సూచనలు చేయనున్నారు.
జిల్లాకు ఈ ఏడాది మూల్యాంకనానికి వచ్చిన సమాధాన పత్రాలు 6 పరీక్షలవే కావడంతో చాలా తక్కువగా కేటాయించారు. జిల్లాకు 2.75 లక్షల సమాధాన పత్రాలు కేటాయించారు. గతంలో 11 పేపర్లు ఉన్న సమయంలో సుమారు 5 లక్షల వరకు కేటాయించేవారు. స్పాట్లో పాల్గొనే ఉపాధ్యాయులకు రోజుకు గరిష్టంగా 40 పేపర్లు మాత్రమే మూల్యాంకనానికి ఇవ్వనున్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా సమాధాన పత్రాలను తగ్గించి ఇవ్వనున్నారు. మూల్యాంకనంలో తప్పులు జరిగితే కఠిన చర్యలు, షోకాజ్ నోటీసులు ఇవ్వనున్నట్లు డీఈవో యాదయ్య ‘నమస్తే’కి తెలిపారు.
తెలుగు సబ్జెక్టుకు స్కూల్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు 148 మంది కాగా, హిందీ సబ్జెక్టుకు ఎస్ఏ-150, ఇంగ్లిష్‌లో 164 మంది, గణితంలో 253 మంది, భౌతిక శాస్త్రంలో 157 మంది, జీవశాస్త్రంలో120 మంది, సాంఘిక శాస్త్రంలో 146 మందిని మూల్యాంకనంలో నియమించారు. స్పాట్లో స్పెషల్ అసిస్టెంట్లు 375తో కలిపి మొత్తంగా 1,513 మంది పాల్గొనున్నారు. వీరిలో చీఫ్ ఎగ్జామినర్లు (సీఈ), అసిస్టెంట్ ఎగ్జామినర్లు (ఏఈ) ఉన్నారు. స్పాట్లో వీరితోపాటు స్ట్రాంగ్ రూమ్ స్టాఫ్, కోడింగ్, ఫ్యాకింగ్, ఏసీవోలు, డిప్యూటీ క్యాంప్ ఆఫీసర్లు ఇలా మరో 42 మంది పాల్గొంటున్నారు. క్యాంప్‌లో మొత్తంగా 1,555 మంది పాల్గొననున్నారు.
ఖమ్మంలో నిర్వహించే పదో తరగతి క్యాంప్‌నకు సంబంధించి ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల నుంచి ఉపాధ్యాయులను నియమించారు. ఖమ్మం నుంచి 950 మంది, భధ్రాద్రి నుంచి 530 మంది, మహబూబాబాద్ నుంచి 33 మంది అన్ని సబ్జెక్టుల్లో నియమించారు. వీరు జూన్ 2న క్యాంప్‌లో రిపోర్ట్ చేయనున్నారు. క్యాంప్‌ను వరంగల్ ఆర్జేడీ సత్యనారాయణరెడ్డి పర్యవేక్షించనున్నారు.