మామిళ్లగూడెం, డిసెంబర్ 30: నూతన సంవత్సర వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్‌శాఖ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ సునీల్‌దత్ సోమవారం ఒక ప్రటకనలో తెలిపారు. సున్నితమైన ప్రాంతాలు, ప్రార్థనా స్థలాలు, ప్రధాన రహదారులు, సినిమా థియేటర్లు, లకారం ట్యాంక్‌బండ్, వెలుగుమట్ల పార్కు తదితర పబ్లిక్ పార్కుల్లో పోలీసు పెట్రోలింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా యువత ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్‌లను తగ్గించేందుకు ప్రధాన రహదారులపై వాహన తనిఖీలు నిర్వహిస్తామన్నారు.
పటాకులు పేల్చడాన్ని నిషేధించాలని పోలీసులను ఆదేశించినట్లు తెలిపారు. వేడుకల సందర్భంగా గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని నూతన సంవత్సర మొదటిరోజు ఏ కుటుంబం విషాదకర ఘటనతో ఆరంభం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మైనర్లకు ద్విచక్ర వాహనాలు, కార్లు ఇవ్వడం కారణంగా వారు మద్యం మత్తులో లేదా నిర్లక్ష్యంగా వాహనాలను నడిపితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. అందుకని తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని కోరారు.