వైరా టౌన్, మార్చి 10: సర్కారు బళ్లలోనే నాణ్యమైన విద్య అందుతోందని ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్ పేర్కొన్నారు. పాఠశాలల్లో చేపడుతున్న పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘మన ఊరు – మన బడి’ పనుల పురోగతిని తెలుసుకునేందుకు వైరా మున్సిపాలిటీలో శుక్రవారం ఆయన పర్యటించారు. జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల, మండల ప్రాథమిక పాఠశాల, తెలంగాణ గురుకుల విద్యాలయం, బాలికల జూనియర్ కళాశాలలో ‘మన బడి’ కింద జరుగుతున్న అదనపు గదులు, కిచెన్ షెడ్, టాయిలెట్లు, ఫ్లోరింగ్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులతోపాటు తాగునీరు, సంపు, వైరింగ్ పనులను పరిశీలించారు.
పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అదే పాఠశాలలో విద్యార్థులకు పాఠాలు బోధించారు. అనంతరం ఇండోర్ స్టేడియం వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం నూతన సమీకృత మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించారు. డీఈవో సోమశేఖరశర్మ, వివిధ శాఖల అధికారులు నాగశేషు, కేవీకే శ్రీనివాస్, సురేశ్, అనిత, అరుణ, నవీన్, కొత్తపల్లి వెంకటేశ్వరరావు, ముళ్లపాటి సీతారాములు, మాదినేని సునీత పాల్గొన్నారు.