
టీఆర్ఎస్ పట్టం కట్టండి.. అభివృద్ధి చేసి చూపిస్తా..
17, 27డివిజన్ ఎన్నికల సభల్లో మంత్రి అజయ్‌కుమార్
హాజరైన ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, భాస్కర్‌రావు
ఖమ్మం, ఏప్రిల్ 25: ఖమ్మం నగరంలోని పేదలందరికీ ఇండ్ల స్థలాలు ఇవ్వడంతో పాటు ఎన్నికల అనంతరం పట్టాలు పంపిణీ చేస్తామని, ఇచ్చిన మాటను తప్పకుండా నేరవేర్చే ప్రభుత్వమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరంలో 17, 27వ డివిజన్లలో వేర్వేరుగా జరిగిన సభల్లో మంత్రి పువ్వాడ జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, మిర్యాలగూడెం ఎమ్మెల్యే నాగండ్ల భాస్కర్‌రావుతో కలిసి మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఖమ్మం నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. అన్ని రహదారులను ఆధునీకరించడంతో పాటు రోడ్ల విస్తరణ, డివైడర్ల నిర్మాణం, సెంట్రల్ లైటింగ్, పబ్లిక్ టాయిలెట్స్, ఇంటింటికి నళ్లా కనెక్షన్ వంటి పథకాలతో నగరాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. నగరంలోని వందలాది మంది నిరుపేదలకు ఇండ్ల స్థలాలు ఇచ్చిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. అర్హులైన పేదలందరికీ డబుల్‌బెడ్ రూం ఇండ్లు నిర్మించి ఎన్నికల అనంతరం పట్టాలు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చారు.
అభివృద్ధి అంటేనే అజయ్
ఎమ్మెల్యేలు మాగంటి, భాస్కర్‌రావు
హైదరాబాద్‌కు దీటుగా ఖమ్మం నగరాన్ని అభివృద్ధి చేసిన ఘనత మంత్రి పువ్వాడ అజయ్‌కే దక్కుతుందని జూబ్లిహిల్స్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు మాగంటి గోపినాథ్, నాగండ్ల భాస్కర్‌రావు అన్నారు. అభివృద్ధి అంటేనే అజయ్‌కుమార్ అని, ఏదైనా చేయాలనుకుంటే ఎంతటి కష్టమైన సాధించుకునే వ్యక్తి అని కొనియాడారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ మంత్రి అజయ్‌కుమార్‌కు అత్యధిక ప్రాధాన్యత కల్పిస్తూ, కుటంబ సభ్యుడిగా సంబోధిస్తారని గుర్తు చేశారు. ఖమ్మం కార్పొరేషన్లో అన్ని సీట్లు గెలిచి గులాబీ జెండా ఎగురవేసి అజయ్‌కు గుర్తింపు తెచ్చి, సీఎం కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. 17వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థి మందడపు షర్మిల రామకృష్ణ, 27వ డివిజన్ పాలడుగు పాపారావు, సుడా సలహామండలి సభ్యులు మందడపు రామకృష్ణ, మాజీ కార్పోరేటర్ నీలం జయమ్మ, కృష్ణ, తిరుపతయ్య, మల్లేషం, వెంకటేశ్వర్లు, ఉపేందర్, వెంకటనారాయణ, సురేష్, మంగారావు తదితరులు పాల్గొన్నారు
టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే నగర అభివృధ్దికి నాంది
మామిళ్లగూడెం,ఏప్రిల్ 25: ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే నగర అభివృద్ధికి నాంది కావాలని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం 19,20, 21, 22, 24వ డివిజన్ల అభ్యర్థుల గెలుపును కాంక్షిస్తూ ఆయా డివిజన్ల పరిధిలో రోడ్‌షోలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఖమ్మం నగర అభివృద్ధిని మరింత ముందుకు తీసుకపోవాలంటే తప్పని సరిగా టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. 24వడివిజన్ అభ్యర్థి కమర్తపు మురళి డివిజన్ పరిధిలోని సెయింట్ మేరీస్ పాఠశాలలో నిర్వహించిన సభలో మంత్రి మాట్లాడారు. డివిజన్ పరిధిలో అభివృద్ధి సంక్షేమ పథకాలు మంజూరు చేయించడంలో మురళి ఎంతో కృషి చేశారన్నారు. అనంతరం 22వ డివిజన్ అభ్యర్థి పల్లా రోజ్లీన ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలో రోడ్‌షో నిర్వహించారు. 19వ డివిజన్లో టీఆర్ఎస్ బలపర్చిన సీపీఐ అభ్యర్థి చామకూరి వెంకటనారాయణ గెలుపును కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహించారు. సాయంత్రం20వ డివిజన్ అభ్యర్థి బిక్కసాని ప్రశాంతలక్ష్మి, 21వ డివిజన్ అభ్యర్థి ఆళ్ల నిరిషారెడ్డి ప్రచారంలో భాగంగా రోడ్ షో నిర్వహించారు. మంత్రి ఎన్నికల ప్రచారంలో డివిజన్ల ఇన్చార్జిలు ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, సుడా డైరెక్టర్ పల్లా కిరణ్, టీఆర్ఎస్ నాయకులు ఆళ్ల వెంకటరెడ్డి, ఆళ్ల అంజిరెడ్డి, జశ్వంత్, అల్లం దుర్గారావు, అమరగాని వెంకన్న, షేక్ షకీనా, సీపీఐ జిల్లా నాయకులు షేక్ జానీమియా తదితరులు పాల్గొన్నారు.