
వారిని మభ్యపెట్టడం ప్రతిపక్షాల తరంకాదు
టీఆర్ఎస్ అభ్యర్థులు, నేతల సమావేశంలో మంత్రి అజయ్
పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామా, మాజీ మంత్రి తుమ్మల
ఖమ్మం, ఏప్రిల్ 24 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఖమ్మం నగర పాలక సంస్థ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం ఖాయమని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ స్పష్టం చేశారు. నగరంలో జరిగిన అభివృద్ధిపై మాట్లాడలేని ప్రతిపక్షాలు.. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. కేఎంసీలో పోటీ చేస్తున్న టీఆర్ఎస్ అభ్యర్థులు, ఉమ్మడి జిల్లా టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, ఎన్నికల ఇన్చార్జులు, మిత్రపక్షమైన సీపీఐ నేతలతో కలిసి ఖమ్మంలోని సప్తపది కల్యాణ మండపంలో శనివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి, రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలుపరుస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు ఇప్పటికే ఒక స్పష్టత వచ్చిందని అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, నగరంలో జరిగిన అభివృద్ధిని వివరించడం ద్వారా ఓటర్ల మనసు గెలుచుకోవాలని సూచించారు. కొవిడ్ కారణంగా ఎన్నికల ప్రచారాన్ని ఓటర్లకు ఇబ్బందులు లేని రీతిలో నిర్వహించాలని సూచించారు. ఈ ఎన్నికలను అన్ని రాజకీయ పక్షాలూ ఒక తంతుగా భావిస్తున్నాయని, టీఆర్ఎస్ మాత్రం ఎన్నికలను బాధ్యతగా తీసుకుని భవిష్యత్ నగర అభివృద్ధికి కొలమానంగా భావిస్తోందని స్పష్టం చేశారు.
ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో జరిగిన అభివృద్ధిని చూసి ఖమ్మం నగర ప్రజలు గర్వపడుతున్నారని , ఏ నగరానికీ లేనంత అద్భుత అవకాశం ఖమ్మానికి దక్కిందని అన్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ నగరపాలక సంస్థ ఎన్నికలు ఈ సారి ఏకపక్షంగా జరుగనున్నాయని స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రాజకీయ ప్రత్యర్థులుగా వ్యవహరించిన నేతలంతా ఇప్పుడు టీఆర్ఎస్లో ఉండటంతో నగరంలో టీఆర్ఎస్కు తిరుగులేదని అన్నారు. సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య మాట్లాడుతూ నగర అభివృద్ధి ఖమ్మం ప్రజల మనసులో నాటుకుందని, విజయానికి ఢోకాలేదని అన్నారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, కందాళ ఉపేందర్‌రెడ్డి, రాములు నాయక్, హరిప్రియ, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజ్ ప్రసంగించారు. టీఎస్ సీడ్స్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జూబ్లీహిల్స్, మిర్యాలగూడ ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, నల్లమోతు భాస్కరరావు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యురాలు చంద్రావతి, మాజీ ఎమ్మెల్యే మదన్‌లాల్, భద్రాద్రి జడ్పీ చైర్మన్ కనకయ్య, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, డీసీఎంఎస్ చైర్మన్ శేషగిరిరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్‌కుమార్, స్వర్ణకుమారి తదితరులు పాల్గొన్నారు.