
ములకలపల్లి, మే 2: గతంలో సీతారాంపురం పంచాయతీలో వీధుల పక్కనే చెత్తాచెదారం కనిపించేది.. దుర్వాసన వ్యాపించేది.. సీజనల్ వ్యాధులు ప్రబలేవి.. గ్రామస్తులు అనారోగ్యానికి గురయ్యేవారు.. ఎవరైనా చనిపోతే కర్మకాండలు చేయడానికి నిలువ నీడలేని దుస్థితి.. కానీ, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామరేఖలే మారిపోయాయి. ‘పల్లె ప్రగతి’లో చేపట్టిన అభివృద్ధి పనులు సీతారాంపురంతో పాటు ఆనందపురం, వేముకుంట, పాతూరు, సుబ్బనపల్లి, అన్నారం, చింతలపాడు, గుర్రాలగుంట గ్రామాలకు కొత్తరూపును తీసుకువచ్చాయి. ఈ గ్రామంలో 780 కుటుంబాలు ఉండగా 2800 జనాభా ఉన్నది.
సుందరంగా పల్లెప్రకృతి వనం..
పంచాయతీ పరిధిలోని ఏడు గ్రామాలకు కలిపి అన్నారం శివారులోని మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో రూ.7.5లక్షల నిధులతో ఏర్పాటైన పల్లె ప్రకృతి వనం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నది. సిబ్బంది వేలాది మొక్కలు పెంచుతున్నారు. వనంలో కొబ్బరి, మామిడి, జామ, బత్తాయి, నారింజ, నేరేడు, బాదం, పనస వంటి పండ్ల మొక్కలతో పాటు పూల మొక్కలూ పెరుగుతున్నాయి. రూ.50 వేల దాతల సాయంతో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి, గౌతమ బుద్ధుడి విగ్రహాలు ఆకట్టుకుంటున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం డంపింగ్ యార్డుకు నిధులు కేటాయించడంతో యార్డు అందుబాటులోకి వచ్చింది. పంచాయతీకి ట్రాక్టర్ సమకూరడంతో పారిశుధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్‌యార్డుకు తరలిస్తున్నారు. ట్యాంకర్ సమకూరడంతో హరితహారం మొక్కలకు ప్రతిరోజూ నీరు అందుతున్నాయి. గ్రామంలో ప్రతి ఇంట్లో మరుగుదొడ్డి నిర్మించడంతో పంచాయతీ పూర్తి ఓడీఎఫ్ గ్రామమైంది.
అన్ని వసతులతో వైకుంఠధామం..
గతంలో గ్రామాల్లో ఎవరైనా మరణిస్తే వారికి దహన సంస్కారాలు నిర్వహించేందుకు ఇబ్బందులు పడాల్సివచ్చేది. పల్లె ప్రగతిలో భాగంగా ఉపాధి నిధులతో ఏర్పాటైన వైకుంఠధామంతో సమస్యలన్నీ తీరాయి. ఈ శ్మశానవాటికలో స్నానాల గదులు, మరుగుదొడ్లు, షెడ్లు అందుబాటులోకి వచ్చాయి.
నిధులు సద్వినియోగం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.4.5 లక్షలు విడుదల చేస్తుంది. ఆ నిధులతో పంచాయతీ నిర్వహణ చేపడుతున్నాం. గ్రామాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించగలుగుతున్నాం. ఎనిమిది మంది తాత్కాలిక ఉద్యోగులను నియమించి పారిశుధ్య పనులు చేయిస్తున్నాం. పంచాయతీ పరిధిలోని అన్ని గ్రామాలకు తాగునీటి వసతి ఏర్పాటు చేశాం. అంతర్గత రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించాం.
-దుబ్బా సునీత, సర్పంచ్, సీతారాంపురం
సీజనల్ వ్యాధులు లేవు..
గతంలో గ్రామంలో ఎక్కడపడితే అక్కడ చెత్తాచెదారం కనిపించేది. మాంసం వ్యర్థ పదార్థాలు పక్కనే ఉన్న వాగులో వేయడం వల్ల దుర్వాసన వచ్చేది. ‘పల్లె ప్రగతి’ వచ్చిన తర్వాత పారిశుధ్యం మెరుగుపడింది. సిబ్బంది ఎప్పటికప్పుడు వీధులను శుభ్రం చేస్తున్నారు. చెత్తాచెదారాన్ని డంపింగ్‌యార్డులకు తరలిస్తున్నారు. గ్రామం పరిశుభ్రంగా ఉంటున్నది. ఇప్పుడు సీజనల్ వ్యాధులు లేనే లేవు.
-సున్నం వెంకటేశ్వర్లు, గ్రామస్తుడు, సీతారాంపురం